
ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాల అభివృద్ధి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
నేరడిగొండ: ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డితో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలోనే రోప్‌వే నిర్మిస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం రిసార్ట్ పనులను ప్రారంభించామని, జూన్ నాటికి రిసార్టు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణం దెబ్బతినకుండా కుంటాల జలపాతాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేలా చూస్తామన్నారు. నిజాం కాలంలోనే కుంటాల జలపాతం వద్ద అప్పటి అధికారులు ఇక్కడ సేద తీరినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటాల జలపాతానికి, పర్యాటక రంగానికి చేసిందేమి లేదన్నారు. మంత్రి వెంట కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, నాయకులు తుల అరుణ్ కుమార్, ఆత్రం సుగుణ, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్‌రావు, తిత్రే నారాయణసింగ్, జాదవ్ కపిల్, ఆడే సతీశ్, బద్దం పోతారెడ్డి, నాయిడి రవి, తదితరులు ఉన్నారు.