● ప్రతీ కిలోమీటర్‌కు ఒక నీటివనరు ఏర్పాటు ● సోలార్ పంపుల ద్వారా తాగునీటిని అందించే యత్నం ● చెలిమెలు, ర్యాంప్‌వెల్స్, సోలార్ పీటీలు, నీటికుంటలకు ప్రాధాన్యం
జన్నారం: అడవిలో నివసించే వన్యప్రాణులకు వేసవిలో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నందువల్ల అటవీశాఖ ముందస్తుగానే అప్రమత్తమైంది. అడవిలో ఉన్న నీటి వనరులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సహజసిద్ధమైన నీటితో సహా సోలార్ పంపుల ద్వారా నీటిని అందించేందుకు ప్రయత్నిస్తోంది. మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్ ఆదేశాల మేరకు జన్నారం అటవీ డివిజన్‌లోని మూడు అటవీ రేంజ్‌లు, 40 అటవీ బీట్‌లలో నీటిఎద్దడి నివారణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈక్రమంలో అడవిలోని వాగులు, ఊటనీటిని సహజ సిద్ధంగా నీటిఎద్దడి ప్రాంతాల్లో సోలార్ పంపుల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. చెలిమెలు, ర్యాంప్‌వెల్స్, సోలార్ పీటీలు, నీటికుంటలతో పాటుగా ఊట నీటిని వన్యప్రాణులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. జన్నారం అటవీ డివిజన్‌లోని మూడు అటవీ రేంజ్‌లలో ఐదు చోట్ల సహజ నీటి వనరులు, 187 కుంటలు, 29 సోలార్ పంపులు, 30 ర్యాంప్‌వెల్స్ ద్వారా నీటిసౌకర్యం కల్పిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
సహజ సిద్ధమైన జలానికే ప్రాధాన్యత
గతంలో సాసర్ వెల్‌లో ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణులకు అందించేవారు. ప్రస్తుతం ఈ పద్ధతికి స్వస్తి పలికారు. వాగునీరు, జలధారలతో పా టు నీటికుంటలు, ర్యాంప్‌వెల్స్, సోలార్ పంపులతో నీటిని అందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జన్నారం డివిజన్‌లోని మూడు అటవీ రేంజ్‌లలో ప్రతీ కిలోమీటర్ దూరంలో ఒక రకమైన నీటివనరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
వాగుల్లో చెలిమెలు
మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్ జోన్ మాదిరిగా కవ్వాల్ టైగర్‌జోన్‌లో వాగులకు ఆనకట్టలు వేసి సహజ సిద్ధమైన నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రవహించే వాగునీటికి ఆనకట్టలు వేసి నీటిని ఆపుతున్నారు. జన్నారం డివిజన్‌లో గతేడాది 30 చోట్ల ఇలాంటి ఆనకట్టలు వేయగా ఈ ఏడాది వాటి సంఖ్య పెంచనున్నారు. వాగునీటికి అడ్డంగా బండరాళ్లు, ఇసుకతో కట్టకట్టడంతో నీరు నిలిచి చెలిమెలా తయారవుతుంది. పారేనీరు శుభ్రంగా ఉండడంతో వాటిని వన్యప్రాణులు ఇష్టపడుతాయి.
నీటికుంటలు
అడవిలో భూగర్భ జలాలను పెంచేందుకు వర్షపునీ రు వృధాగా పోకుండా నిర్మించిన నీటికుంటలపై అ ధికారులు దృష్టి పెట్టారు. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో 300 వరకు నీటి కుంటలు ఉండగా అందులో 187కు కుంటల్లో ప్రస్తుతం నీరు ఉంది. ఏప్రిల్, మే వరకు 100 కుంటల్లో నీరు ఉండే అవకాశంఉందనిఅధికారులు చెబుతున్నారు.
సాసర్ వెల్ ద్వారా నీటి సౌకర్యం
నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంప్‌వెల్స్ లేని ప్రదేశాల్లో, ఎత్తయిన ప్రాంతంలో సాసర్‌వెల్ ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ట్యాంకర్ ద్వారా నీటిని నింపుతారు. ఆ శబ్ధానికి వన్యప్రాణులు పారిపోయే అవకాశం ఉండడంతో వాటి సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహజ సిద్ధంగా నీటిని అందిస్తున్నారు. ఒకవేళ నీటికొరత ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీటిని నింపనున్నట్లు తెలిపారు.
స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నాం
అడవిలో నివసించే వన్యప్రాణులకు ఆహారంతో పాటు నీటిసౌకర్యం కల్పించేందుకు పలురకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోలార్ పంపులతో కుంటల్లోకి నీటిని వదులుతున్నాం. వన్యప్రాణులకు స్వచ్ఛమైన నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాం.
– కారం శ్రీనివాస్, ఫారెస్ట్ రేంజ్ అధికారి
వన్యప్రాణులకు సహజ జలం