చేపల వల చుట్టుకుని మత్స్యకారుడు.. | - | Sakshi
Sakshi News home page

చేపల వల చుట్టుకుని మత్స్యకారుడు..

Mar 19 2025 12:50 AM | Updated on Mar 19 2025 12:47 AM

సోన్‌: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు మండలంలోని గాంధీనగర్‌ గ్రామానికి చెందిన సస్కిన్‌ సాయికుమార్‌ (28) మంగళవారం వృత్తిరీత్యా చేపలు పట్టేందుకు సరస్వతి కెనాల్‌కు వెళ్లాడు. కాలువలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

చోరీ కేసులో మహిళ రిమాండ్‌

లక్సెట్టిపేట: ఈనెల 16న పట్టణంలోని గోదావరి రోడ్‌లో నివాసముంటున్న కొత్త శ్యామల ఇంట్లో చోరీకి పాల్పడిన వసంత అనే మహిళను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సతీశ్‌ తెలిపారు. అదే కాలనీకి చెందిన వసంత బాధితురాలు శ్యామల ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి ఆమెను బాత్‌రూంలోకి నెట్టివేసి మెడలోని గొలుసు లాక్కుని పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి గొలుసును స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను సోమవారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు..

ఉట్నూర్‌రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం జైనూర్‌ మండలానికి చెందిన కుమ్ర భక్కు (46) మంగళవారం ఉట్నూర్‌ మండలంలోని దంతన్‌పల్లి సమీపంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుండగా మారుతిగూడ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఘటనలో భక్కుకు తీవ్రగాయాలు కావడంతో అటుగా వెళ్తున్న మాజీ ఎంపీపీ గమనించి 108కు సమాచారం అందించగా ముందుగా ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

చికిత్స పొందుతూ మహిళ..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహారాష్ట్రలోని కిన్వట్‌ తాలుకా కొతారి గ్రామానికి చెందిన రాథోడ్‌ జాముబాయి (55) మృతి చెందినట్లు టూటౌన్‌ ఏఎస్సై ముకుంద్‌రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఈనెల 16న రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ఖానాపూర్‌: పట్టణంలోని ఇంద్రానగర్‌ కాలనీలో కడమంచి లక్ష్మణ్‌ నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు. నిరుపేద ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించేందుకు ఇంటి వెనకాల ప్రహరీ వద్ద నిలువ ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

చేపల వల చుట్టుకుని   మత్స్యకారుడు..1
1/1

చేపల వల చుట్టుకుని మత్స్యకారుడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement