
పత్తి డబ్బులు పడ్తలే..!
● రైతుల ఎదురుచూపులు ● కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ
మంచిర్యాలఅగ్రికల్చర్: దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ రంగ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు ధర, సకాలంలో నగదు పొందాలని అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం చేశారు. దీంతో రైతులు అష్టకష్టాలు పడి ప్రభుత్వ రంగ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా.. నగదు కోసం నెలల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థ సీసీఐకి గత డిసెంబర్, జనవరిలో పత్తి విక్రయించిన రైతులకు ఇప్పటికీ నగదు అందలేదు. పత్తి విక్రయించిన వారం రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉండగా.. నెలలు గడుస్తోంది. దీంతో పంట పెట్టుబడికి తెచ్చిన అప్పుపై వడ్డీ పెరిగి, పత్తి ఏరిన కూలీలకు డబ్బు చెల్లించడానికి వాయిదాలు పెడుతున్నారు. ఇటు సీసీఐ అధికారులు అటు మార్కెట్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గత నెలలో చెన్నూర్ మార్కెట్ పరిధిలో రైతులు రాస్తారోకో చేసిన సమయంలో పత్తి విక్రయించిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
వడ్డీ పెరిగిపోతోంది..
అమ్ముకునేందుకు అరిగోస పడుడు అయింది. అమ్మిన పత్తికి మూడు నెలల నుంచి పైసలు పడలేదు. చెన్నూర్ మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లులో పత్తి అమ్మిన. పత్తి కాంటా పెట్టేటప్పుటు పట్టాపాసుబుక్, ఆధార్‌కార్డు, బ్యాంకు బుక్ అన్ని కాగితాలు జిరాక్స్ ఇచ్చిన. మళ్లీ మార్కెట్ ఆఫీసు కాడా కూడా రెండు సార్లు ఇచ్చిన. సాగు కోసం బ్యాంకు లోను తీసుకున్న. వడ్డీ పెరిగిపోతంది. కై కిలోల్లకు పైసలు ఇయ్యలేదు. పత్తిని మిల్లుకు తీసుకపోయినందుకు బండి కిరాయి కట్టలేదు.
– పుట్ట గంగయ్య, నెన్నెల
మూడు నెలలైంది..
మూడు నెలల కిందట చెన్నూర్ మార్కెట్ పరి ధి మిల్లులో సీసీఐకి 30 క్వింటాళ్ల పత్తి అమ్మిన. ఇటు మిల్లు, అటు మార్కెట్ సార్లను అడిగితే రేపు మాపు అంటున్నారు. రూ. 2,26,382 రావాలి. మూడు నెలల నుంచి కై కిలోల్లు డబ్బులు ఇవ్వమని ఇంటికి వచ్చి లొల్లి చేస్తున్నరు. ఆలస్యం చేయకుండా పైసలు వేయాలి.
– బింగి పద్మ, నెన్నెల
జిల్లాలో సేకరించిన పత్తి
సీసీఐ 6,32,965 క్వింటాళ్లు
మొత్తం రైతులు 25,029 మంది
చెల్లించాల్సిన నగదు రూ.478,47,61,875
నగదు అందిన రైతులు 22,951 మంది
అందిన నగదు రూ.449,66,55,665
ఇంకా అందాల్సిన రైతులు 2078 మంది
అందాల్సిన నగదు రూ.274,62,01,184

పత్తి డబ్బులు పడ్తలే..!

పత్తి డబ్బులు పడ్తలే..!