మొదటిరోజు మోనో ఖాళీ! | Poor Response For Mumbai Monorail Services | Sakshi
Sakshi News home page

మొదటిరోజు మోనో ఖాళీ!

Oct 20 2020 2:09 PM | Updated on Oct 20 2020 2:47 PM

Poor Response For Mumbai Monorail Services - Sakshi

చెంబూర్‌–వడాల–సాత్‌రాస్తా మార్గం మీదుగా రాకపోకలు సాగించే మోనో రైళ్లకు ముంబైకర్ల నుంచి స్పందన రాకపోవడంతో అధికారులు అయోమయంలో పడిపోయారు.  

సాక్షి, ముంబై: మోనో రైళ్లు ప్రారంభించిన మొదటి రోజు ముంబైకర్ల నుంచి అత్యల్ప స్పందన వచ్చింది. ప్రయాణికులు లేక దాదాపు రైళ్లన్ని ఖాళీగానే తిరిగాయి. ప్రతీ బోగీలో వేళ్లపై లెక్కించే విధంగా ప్రయాణికులు కనిపించారు. దీంతో అధికారుల ఆర్థిక అంచనాలు తారుమారు కావడంతో తలలు పట్టుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడు నెలలుగా షెడ్డుకే పరిమితమైన మోనో రైళ్లు అదివారం నుంచి ప్రారంభమైన విషయ తెలిసిందే. చెంబూర్‌–వడాల–సాత్‌రాస్తా మార్గం మీదుగా రాకపోకలు సాగించే మోనో రైళ్లకు ముంబైకర్ల నుంచి స్పందన రాకపోవడంతో అధికారులు అయోమయంలో పడిపోయారు.  

బోగీకి 10 మందే.. 
చెంబూర్‌ స్టేషన్‌ నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటలకు మొదటి రైలు బయలుదేరింది. ఆ తరువాత 20 నుంచి 30 నిమిషాలకొక రైలును నడిపారు. లోకల్‌ రైళ్లలో మాదిరిగా అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులను కాకుండా మోనోలో అందరిని అనుమతించారు. ముఖానికి మాస్క్‌ ధరించిన వారిని అనుమతించడంతో పాటు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ప్రతీ ప్రయాణికుడి టెంపరేచర్‌ పరీక్షించారు. చేతులు శానిటైజ్‌ చేసి ప్లాట్‌ఫారంపైకి పంపించారు. అయినప్పటికీ ప్రయాణికులు ముఖం చాటేశారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రతీ బోగీలో 30 మంది కంటే ఎక్కువ అనుమతించరాదని అధికారులు సూచించారు.
(చదవండి: కరోనా ఎఫెక్ట్‌తో స్వయం ఉపాధిలోకి.. )

కాని వాస్తవ పరిస్థితులు అందుకు బిన్నంగా కనిపించాయి. ఏ బోగీలో చూసిన 10–12 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అయితే ఆదివారం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థల కార్యాలయాలకు సెలవు ఉంది. దీంతో మొదటిరోజు ప్రయాణికులు లేక రైళ్లన్ని ఖాళీగా తిరిగి ఉండవచ్చని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. సోమవారం నుంచి పూర్తి సామర్థ్యంతో పరుగులు తీస్తాయని భావిస్తున్నారు. లోకల్‌ రైళ్లలో సామాన్యులకు అనుమతివ్వడం లేదు. దీంతో ఈ రైళ్లు కూడా పూర్తి సామర్థ్యంతో తిరగడం లేదు. నేలపై తిరిగే లోకల్‌ రైల్వే స్టేషన్లతో పైనుంచి వెళ్లే మోనో స్టేషన్లకు అనేక చోట్ల కనెక్టివిటీ చేశారు. కానీ, లోకల్‌ రైళ్లలో ప్రయాణికులు అంతంత మాత్రమే ఉంటున్నారు. దీంతో మోనో రైళ్లు ఖాళీగా తిరగడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.   
(చదవండి: బాలీవుడ్‌ తరలింపు అంత ఈజీ కాదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement