దేవరకద్ర అతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

దేవరకద్ర అతలాకుతలం

Jun 18 2026 1:11 AM | Updated on Jun 18 2026 1:11 AM

పరిశీలించిన ఎమ్మెల్యే..

బీభత్సం సృష్టించిన వాన, గాలిదుమారం

బొలెరోపై గోడ కూలి ఇద్దరి దుర్మరణం

నేలకొరిగిన భారీ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

నిలిచిన విద్యుత్‌ సరఫరా..

అంధకారంలో దేవరకద్ర

దేవరకద్ర: మున్సిపాలిటీలో బుధవారం సాయంత్రం భారీ వర్షంతో కూడిన గాలిదుమారం బీభత్సం సృష్టించింది. ఒక్కసారి సృష్టించిన విధ్వంసంతో దేవరకద్ర చిగురుటాకులా వణికిపోయింది. తీవ్రమైన గాలివాన వీయడంతో గోడ పక్కన బొలెరో ఆపి అందులోనే కూర్చున్న ఇద్దరు వ్యక్తులు గోడ కూలి మృతిచెందారు. పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీనికితోడు బుధవారం వారాంతపు సంత కావడంతో రోడ్లపై కూరగాయలు, ఇతరత్రా చిరు వ్యాపారాలు భీకరమైన గాలులకు వేసిన టెంట్లు కొట్టుకుపోయాయి. పానీపూరి బండ్లు, శీతల పానియాలు విక్రయించే బండ్లు కొట్టుకుపోగా.. నిలిపిన ద్విచక్రవాహనాలు కిందపడ్డాయి. దేవరకద్ర సంత అంతా అతలాకులంగా మారడంతో ప్రజలు బతుకు జీవుడా అంటూ పరుగులు తీశారు. ఇదే సమయంలో వడగాళ్ల వాన కురవడంతో పట్టణమంతా భయంతో భీతిల్లిపోయింది. ఇంతటి గాలివాన దుమారం ఎప్పుడూ చూడ లేదని పలువురు చర్చించుకున్నారు. చాలాచోట్ల చెట్లు విరిగిపడగా.. విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. గాలివాన బీభత్సంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో ప్రజలు రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ అంధకారంలో ఉండిపోయారు.

దేవరకద్రలో గాలివాన సృష్టించిన బీభత్సాన్ని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి బుధవారం రాత్రి పరిశీలించారు. అదేవిధంగా భారత్‌మాలలో పనిచేసే సివిల్‌ ఇంజినీర్‌, డ్రైవర్‌ మృతిచెందిన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.సంతలో నష్టపోయిన వారితో మా ట్లాడారు. జరిగిన నష్టంపై అంచనాలు రూ పొందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement