● వెన్నాచేడ్ మోడల్ స్కూల్‌లో
అడ్మిషన్ల జోరు
● ఏటేటా పెరుగుతున్న
విద్యార్థుల సంఖ్య
● పాఠశాలలో వసతులు
లేకపోయినా చేరేందుకు ఆసక్తి
గండేడ్ మండలం వెన్నాచేడ్ గ్రామానికి దాదాపు కిలోమీటర్ దూరంలో ఆదర్శ పాఠశాల ఉంటుంది. ఉమ్మడి గండేడ్ మండలంతో పాటు మిగతా కోయిల్‌కొండ, నవాబుపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్ తదితర మండలాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 636 మంది చదువుతున్నారు. మొదట్లో 100 మంది దాటని విద్యార్థుల సంఖ్య.. ప్రతి ఏడాది ఊహించని విధంగా పెరుగుతోంది.
సమస్యలను అధిగమించి..
వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో చదివే విద్యార్థులు నానా కష్టాలు పడుతూ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. గ్రామానికి బస్సు సరిగ్గా లేకపోయినా ఓపికతో పాఠశాలకు వస్తున్నారు. జానంపల్లి ప్రధాన రహదారి నుంచి పాఠశాలకు 2 కి.మీ. దూరం ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు విద్యార్థుల కోసం వస్తున్నా.. అది మిస్సయితే కాలినడకే శరణ్యం. ఒక్కోసారి ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లి.. తిరిగి పాఠశాల నుంచి ఇంటికి వెళ్లడానికి రాత్రి 9 గంటలైనా సందర్భాలు లేకపోలేదు. హాస్టల్ వసతి కూడా పూర్తిస్థాయిలో లేదు. కేవలం 100 మందికి మాత్రమే ఉంది. అది అమ్మాయిలకు మాత్రమే. బాలురకు అసలే వసతి లేదు. మధ్యాహ్న భోజనం మాత్రం ఉంటుంది. అయినా విద్యార్థుల సంఖ్య తగ్గడం లేదు.
రెండేళ్లుగా వందశాతం ఉత్తీర్ణత..
2024–25 విద్యా సంవత్సరం పదో తరగతిలో 92 మంది విద్యార్థులకు గాను వందశాతం ఉత్తీర్ణులయ్యారు. 2025–26లో 87 మందికి గాను 87 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇంటర్‌లోనూ అదే ఫలితాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇంటర్‌లో ఎంపీసీ విద్యార్థిని అశ్విని స్టేట్ 5వ ర్యాంకు సాఽధించి.. పాఠశాలకు మరింత వన్నె తెచ్చింది. సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఇక్కడ చక్కటి విద్యా భోదన చేయడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీనికితోడు పాఠశాలలో ల్యాబ్‌లు, కంప్యూటర్లు, సరిపడా తరగతి గదులు ఉన్నాయి. క్రీడా ప్రాంగణం కూడా ఉంది. అటు చదువుతో పాటు ఈ పాఠశాల విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు.
సీట్ల కోసం ఆరాటం..
వెన్నాచేడ్ మోడల్ స్కూల్‌లో ప్రతి ఏటా అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే ఎలాగైనా పాఠశాలలో సీటు పొందాలని విద్యార్థులు తహతహలాడుతున్నారు. ప్రవేశాల కోసం వందలకొద్దీ దరఖాస్తులు వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో 100 సీట్లు ఉండగా.. 192 దరఖాస్తులు వచ్చాయి. ఇంటర్‌లో 40 సీట్లకు గాను 126 దరఖాస్తులు వచ్చాయి. ఆయా తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి 336 దరఖాస్తులు రాగా.. ఇంటర్ ఆయా గ్రూపులకు గాను 256 దరఖాస్తులు వచ్చాయి. తమ పిల్లలను మోడల్ స్కూల్‌లో చేర్చేందుకు తల్లిదండ్రులు నానాపాట్లు పడుతున్నారు. రాజకీయన నాయకులు, అధికారులతో ఫోన్లు చేయిస్తూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా వెన్నాచేడ్ మోడల్ స్కూల్ అంటేనే ఉత్తమ విద్యలో ప్రత్యేకత చాటుతోంది.
ఆ పాఠశాల ఊరికి దూరంగా ఉండటంతో పాటు బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. బాలికలకు హాస్టల్ వసతి సైతం పూర్తిస్థాయిలో లేదు. బాలుర హాస్టల్ అసలే లేదు. అయినా ఆ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. తమ పిల్లలకు సీటు కోసం తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. అదే మహబూబ్‌నగర్ జిల్లాలోని గండేడ్ మండలం వెన్నాచేడ్ మోడల్ స్కూల్. 2013లో ప్రస్తుత ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చొరవతో ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది.
– గండేడ్
పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయ బృందం ఉంది. డిజిటల్ క్లాసులు నడుస్తున్నాయి. అన్ని వసతులు ఉన్నాయి. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్యాబోధన చేస్తున్నాం. తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు నిర్వహించి.. విద్యార్థుల ప్రగతిపై చర్చిస్తున్నాం. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడమే లక్ష్యం. విద్యార్థులు కష్టపడటంతో పాటు తల్లిదండ్రులు కూడా సహకరించాలి.
– రైసీ ఫాతిమా, ప్రిన్సిపాల్,
మోడల్ స్కూల్, వెన్నాచేడ్
మోడల్ స్కూల్‌లో విద్యా బోధన బాగుందని విన్నా ను. ఎలాగైనా అక్కడ చేరా లని అనుకున్నా. మా స్నేహితుల సహకారంతో సీటు సంపాదించాను. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో చేరాను. అక్కడే హాస్టల్ సీటు కూడా దొరికింది. దీంతో కష్టపడి చదివాను. ఉపాధ్యాయులు కూడా చక్కగా ప్రోత్సహించారు. మొత్తం 470 మార్కులకు గాను 465 మార్కులతో రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించాను.
– టి.అశ్విని, వేపూర్, హన్వాడ మండలం


