తుది అంకానికి చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

తుది అంకానికి చాంపియన్‌షిప్‌

May 1 2026 8:14 AM | Updated on May 1 2026 8:14 AM

ఢిల్లీ దూకుడు

సెమీస్‌కు చేరిన ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, డీఏవీ జట్లు

ఏర్పాట్లు పరిశీలించిన టోర్నీ

పరిశీలకుడు సంజయ్‌కుమార్‌

జడ్చర్ల టౌన్‌: ఎస్‌జీఎఫ్‌ 69వ జాతీయ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లో కలిపి మొత్తం 5 మైదానాల్లో జరుగుతున్న టోర్నమెంట్‌లో ఇప్పటికే 45 లీగ్‌ మ్యాచ్‌లు, 8 ఫ్రీ క్వార్టర్స్‌, 4 క్వార్టర్స్‌ మ్యాచ్‌లు ముగిశాయి. శుక్రవారం రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లతోపాటు మూడోస్థానం కోసం మరో మ్యాచ్‌, ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. కాగా గురువారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో రాణించిన ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, డీఏవీ జట్లు సెమీస్‌కు చేరాయి.

ఏర్పాట్లపై ఆరా..

ఎస్‌జీఎఫ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా జడ్చర్ల మినీ స్టేడియంలో జమ్ముకాశ్మీర్‌, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ను జాతీయ పరిశీలకులు సంజయ్‌కుమార్‌ వీక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పరిచయం చేసుకుని, వారి కి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాస్ఫూర్తితో రాణించాలని సూచించారు.అంతకు ముందు ఆయన ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శారదాబాయి, రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు నిరంజన్‌తో 5 మైదానాల్లో జరిగిన లీగ్‌, ఫ్రీక్వార్టర్‌ మ్యాచ్‌ల వివ రాలను తెలుసుకున్నారు. క్రీడాకారులకు కల్పించిన వసతి, భోజనం తదితర ఏర్పాట్లపై ఆరా తీశారు.

క్వార్టర్‌ ఫైనల్స్‌లో 20 ఓవర్లు..

లీగ్‌, ఫ్రిక్వార్టర్‌ వరకు 15 ఓవర్ల మ్యాచ్‌లు నిర్వహించగా.. క్వార్టర్‌ ఫైనల్‌లో 20 ఓవర్లతో కొనసాగించారు. సెమీస్‌, మూడో స్థానం, ఫైనల్‌ మ్యాచ్‌లోనూ 20 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ విజయం

మహబూబ్‌నగర్‌ బీఎస్‌ఆర్‌ గ్రౌండ్స్‌లో ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ జట్ల మధ్య జరిగిన ఫ్రీ క్వార్టర్‌ మ్యాచ్‌ లో ఉత్తరప్రదేశ్‌ జట్టును విజయం వరించిది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. బౌలింగ్‌లో శుభందాస్‌ 3 వికెట్లు తీశాడు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా జట్టు 14.3 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో విష్ణు, హర్ష్‌యాదవ్‌ చెరో 3 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలకపాత్ర పోషించారు.

డీఏవీ సీఎంసీ జయకేతనం

జడ్చర్ల మినీ స్టేడియంలో జమ్ముకాశ్మీర్‌, డీఏవీ సీఎంసీ జట్ల మధ్య జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో డీఏవీసీఏంసీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన డీఏవీ సీఎంసీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగుల చేసింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్ముకాశ్మీర్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. జట్టులో లూబైబ్‌ 62 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. బౌలింగ్‌లో దర్శ్‌, వంశన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

ఉత్తరాఖండ్‌ జోరు

బీఎస్‌ఆర్‌ మైదానంలో ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ జ ట్ల మధ్య జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఉ త్తరాఖండ్‌ విజయం సాధించి సెమి ఫైనల్‌ బెర్త్‌ ఖ రారు చేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ జట్టు 20 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌలైంది. 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్‌ 5 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో లాంఛ నం పూర్తి చేసింది. ధృవ్‌ 42 పరుగులు, కృష్ణ 44 ప రుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

టోర్నీలో అత్యధిక స్కోర్‌ 200..

మహబూబ్‌నగర్‌ ఎండీసీఏ మైదానంలో ఢిల్లీ, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. జట్టులో హర్షిల్‌ 54 పరుగులు, రాహుల్‌ 35 పరుగులతో రాణించారు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 18.4 ఓవర్లలో 153 పరుగులకే చాప చుట్టేసింది. కుష్‌ 36, హేమంత్‌ 34, ఆయుష్‌ 32 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో ఆర్యవీర్‌, ఆకాష్‌, ఆస్మిత్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

సెమీస్‌కు తమిళనాడు

తమిళనాడు– కేరళం జట్ల మధ్య జరిగిన 4వ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తమిళనాడు విజయం సాధించి సె మీస్‌కు చేరింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో తమిళ్‌ 54 బంతుల్లో 64 పరుగులు చేయగా..బౌలింగ్‌లో జెవిన్‌, ఇ షాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు.170 పరుగుల ల క్ష్యంతో బరిలోకి దిగిన కేరళం జట్టు 18.1 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. బౌలింగ్‌లో విబి ష్‌,మావసీం చెరో 3 వికెట్లు తీశారు. 36 పరుగుల తే డాతో గెలుపొందిన తమిళనాడు సెమీస్‌కు చేరింది.

మహబూబ్‌నగర్‌ ఎండీసీఏ మైదానంలో ఢిల్లీ, చండీఘడ్‌ మధ్య జరిగిన ఫ్రీక్వార్టర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జట్టులో గరువు 37 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చండీఘడ్‌ 13.3 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌలైంది. బౌలింగ్‌లో ఆరుష్‌ 4 వికెట్లు తీశాడు.

Advertisement
 
Advertisement
Advertisement