23న గవర్నర్, 24న సీఎం పర్యటన
వనపర్తి/ కోస్గి రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖిలో పాల్గొంటారని, ఇందుకోసం పలువురు ప్రముఖులను ఆహ్వానించాలని ఆర్డీఓ సుబ్రహ్మణ్యంకు సూచించారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టం, కరెంట్ సరఫరా తదితరవి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్‌తో పాటు వివిధ రంగాల్లో జిల్లా సాధించిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్లు
కొడంగల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 24న కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. శనివారం కోస్గిలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్‌హాల్‌లో ఇరు జిల్లాల అధికారులతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాలకు చెందిన నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టాలని, 24న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో కోస్గికి చేరుకుంటారన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని, వారికి వసతులు కల్పించాలన్నారు. సన్మానం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతోపాటు నూతన సర్పంచ్‌లు మధ్యాహ్న భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి వచ్చి.. వెళ్లే వరకు అన్ని బాధ్యతలను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.
23న గవర్నర్, 24న సీఎం పర్యటన
23న గవర్నర్, 24న సీఎం పర్యటన


