విపత్తుల నివారణపై 6 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): భారీ వర్షాలు, వర దలు కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, చెరువులు పొంగి ప్రవహించడం వలన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా విపత్తుల నిర్వహణపై ఈనెల 22వ తేదీన జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాల ననుసరించి జిల్లాలో ఆరు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ తెలిపా రు. శనివారం సంబంధిత అధికారులతో వీసీ నిర్వ హించారు. జిల్లాలో జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో వరదల వలన లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో వరదలు వస్తే ఏవిధంగా విపత్తు నిర్వహణ చేస్తారు, కృష్ణసాగర్ చెరువులో నీటి మట్టం పెరిగి వ్యక్తి కొట్టుకుపోవడం, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో రామయ్యబౌలిలో వర్షం వరద నీరు ఇళ్లలోకి చేయడం, దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీకి వెళ్లే రోడ్డు తెగిపోవడం, మోదెంకుంట చెరువు నీటి మట్టం పెరిగి, లోతట్టు కాలనీలు జలమయం కావడం వంటి సంఘటనలు జరిగితే వివిధ శాఖల అధికారులు ఏ విధంగా స్పందించి సహాయక చర్యలు చేపడుతారో మాక్‌డ్రిల్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీని వల్ల వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు, పార సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ , అగ్నిమాపక, ఆరోగ్య , మునిసిపల్, పరిశ్రమల శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ రత్నం, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కిషోర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.మధుసూదన్‌గౌడ్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీఎంహెచ్‌ఓ కృష్ణ, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


