నేటి నవాబుపేట
సర్పంచులు నాటి నుంచి నేటి దాకా..
నాటి నవాబుల నజరానే..
నవాబుపేట: నాటి నిజాం పాలనలో నవాబుపేట చుట్టుపక్కన ప్రాంతాలు గురుకుంట కొనదుర్గంగా, ఇప్పటూర్ సంస్థానంగా పాలన సాగుతున్న తరుణంలో నవాబుపేట జాగీరుదారుగా ఉంటూ పరిపాలన సాగిందని.. నాటి నుంచి ఈ గ్రామాన్ని నవాబుపేటగా పిలుస్తున్నట్లు పూర్వీకులు చెబుతుంటారు. అయితే ఈ నవాబుపేట పంచాయతీ ఎన్నికల్లో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు 45 ఏళ్లుగా సర్పంచ్‌లుగా కొనసాగారు. వీరిలో మొదట లక్ష్మణ్‌రావు 12 ఏళ్లు, ఆయన సోదరుడు రంగారావు 17 ఏళ్లు ఏకగ్రీవ సర్పంచ్‌లుగా వరుసగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1981లో మొదటి సారి సర్పంచ్ ఎన్నికలు జరిగితే వాటిలో సైతం మాజీ సర్పంచ్ రంగారావు సోదరుడు ప్రహ్లద్‌రావు విజయం సాధిచి రెండు పర్యాయలు వరుసగా సర్పంచ్‌గా గెలుపొందుతూ వచ్చారు. అనంతరం 1995లో గ్రామపంచాయతీల పునర్విభజనలో యన్మన్‌గండ్ల గ్రామం విడిపోగా నవాబుపేట ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.
30 ఏళ్ల తర్వాత మహిళా సర్పంచ్
నవాబుపేటకు 1995లో గాండ్ల శకుంతల చంద్రశేఖర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం దాదాపు 30 ఏళ్ల తరువాత తాజాగా 2025లో గీతారాణి సర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషం. కాగా నవాబుపేట చరిత్రలో 46 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు కాంగ్రెసేతర పార్టీల మద్దతుతో పలువురు సర్పంచ్‌గా కొనసాగితే తాజాగా ప్రజలు స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు.


