రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు రక్షణ లేదు
● బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
అడ్డాకుల: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో దళితులు, గిరిజనులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. మూసాపేట మండలం వేములలో జరిగిన లైంగికదాడి ఘటనలో మృతి చెందిన దళిత యువతి కుటుంబాన్ని శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలను బాఽధిత కుటుంబీకులతో మాట్లాడి తెలుసుకున్నారు. అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాపాలన చేస్తున్నామని చెబుతున్న ప్రభు త్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎస్సీలపై ముఖ్యమంత్రి వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం, పోలీసులు నిద్రపోతున్నారా అని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకోకపోవడం దారుణమన్నారు. యువతిపై అత్యాచారం జరిగి హత్య జరిగినా ప్రభుత్వపరంగా అందాల్సిన నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయన వెంట కమిషన్ మాజీ సభ్యుడు అభిలాష్‌రావు, బస్వరాజుగౌడ్, నరేష్‌రెడ్డి, వామన్‌గౌడ్, లక్ష్మినర్సింహ, నారాయణగౌడ్, గాడీల ప్రశాంత్, తదితరులు ఉన్నారు.


