కుమారుడి మృతిపై విచారణకు తండ్రి డిమాండ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తన కుమారుడు ఆది నవీన్‌కుమార్ (16) అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని తండ్రి ఆది విష్ణువర్ధన్ బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకద్ర మైనార్టీ గురుకుల సంక్షేమ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న తన కుమారుడు గత నెల 9న తోటి స్నేహితులైన మహ్మద్ గౌస్, మాలిక్, టి.చందు, పురుషోత్తంతో కలిసి బయటకు వెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీల్లో బయటపడిందన్నారు. మరుసటి రోజే వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల శివారులోని ఏనుగుంట కాల్వలో మృతదేహం లభించిందని.. ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, విచారించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.


