 
															మరోసారి కనిపించిన చిరుత
నవాబుపేట: మండలంలోని యన్మన్‌గండ్ల సమీపంలో ఉన్న దేవరగుట్టపై బుధవారం మరోసారి చిరుత కనిపించింది. ఇక్కడ కనిపించింది చిరుతనా.. లేక పులినా అన్న ఆందోళన గ్రామస్తుల్లో మొదలైంది. దీంతో గురువారం అటవీశాఖ అధికారులు పరిశీలించి చిరుతేనని నిర్ధారించారు. గతంలో కనిపించిన పరిసరాల్లోనే సంచరిస్తున్నట్లు వివరించారు. రైతులు, గ్రామస్తులు దేవరగుట్ట పరిసర ప్రాంతాల్లో తిరగొద్దని సూచించారు.
3న ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా రగ్బీ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో నవంబర్ 3వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–17 బాల, బాలికల రగ్బీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు.
4న కరాటే ఎంపికలు
నవంబర్ 4వ తేదీన డీఎస్‌ఏ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాల, బాలికల కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి తెలిపారు. ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని ఆమె కోరారు.
బాలికపై అత్యాచారం
● గర్భం దాల్చడంతో
ఆలస్యంగా వెలుగులోకి..
నవాబుపేట: బాలికపై వరుసకు బావ అయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా సదరు బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) పదో తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటుంది. కాగా బాలికకు వరుసకు బావ అయ్యే వ్యక్తి బాలికను లోబరుచుకొని అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే వ్యక్తి బాలికతో ఉండగా కుటుంబ సభ్యులు గమనించి గొడవకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో సదరు వ్యక్తి తనపై దాడి చేస్తున్నారని 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని గొడవను అడ్డుకున్నారు. ఇంతలోనే బాలిక కుటుంబ సభ్యులు తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ విక్రమ్ చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
