 
															కృష్ణానదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్ కథనం మేరకు.. వనపర్తి జిల్లాలోని కాశీంనగర్‌కు చెందిన వెంకటేష్ తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి మధ్యాహ్నం బీచుపల్లి కృష్ణానది బ్రిడ్జి వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు పంపించాడు. అనంతరం బైక్, మొబైల్‌ను బ్రిడ్జిపై వదిలేసి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారి సమాచారం మేరకు ఇటిక్యాల పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది కలిపి 26 మంది రెండు స్పీడ్ బోట్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపడతామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆత్యహత్యకు పాల్పడిన వ్యక్తి గతంలో భార్యను హతమార్చి జైలుకు పోయినట్లు సమాచారం. ఆ ఘటనతో వారి ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోగా.. ఇప్పుడు తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అనాథలుగా మారారని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
