 
															రైతన్నకు కన్నీరే దిక్కు!
మిడ్జిల్‌కు చెందిన బీర్ల ఆంజనేయులు తనకు ఉన్న నాలుగు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షానికి పంట చేతికి వచ్చే దశలో నాలుగు ఎకరాలు పూర్తిగా నేలమట్టమైంది. దీంతో దాదాపు రూ.లక్షన్నర నష్టం వాటిల్లింది. ‘పంట నేలకు వాలడంతో వడ్లు మొలకెత్తుతున్నాయని, నష్టం ఇంకా పెరుగుతుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.’అని సదరు రైతు వేడుకుంటున్నాడు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మోంథా తుపాను రైతులను నట్టేట ముంచింది. సుమారు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు నీటిపాలయ్యాయి. ప్రధానంగా కోత దశలో ఉన్న వరి.. ఏరే దశలో ఉన్న పత్తికి భారీ నష్టం వాటిల్లింది. వీటితో పాటు వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, ఉల్లిగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తగా పంట చేలల్లో ఇసుక మేటలు వేయడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో అధికం..
ఉమ్మడి పాలమూరులోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,388 మంది రైతులకు సంబంధించి 33,559 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో 1,336 మంది రైతులకు చెందిన 2,270 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,013 మంది రైతులకు సంబంధించి మొత్తం 1,141 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంటకు చెందిన ఇతడి పేరు భాస్కర్‌రెడ్డి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా.. దొరికిన చోటల్లా అప్పు చేసి ఐదు ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. నాలుగు నెలలుగా ఇతని కుటుంబం మొత్తం కష్టపడింది. వారంలో రోజుల్లో పంట కోతలు ప్రారంభించాలనుకున్నాడు. అంతలోనే రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి మూడు ఎకరాల పంట పూర్తిగా నీటి మునిగింది. మొక్కపైనే ధాన్యం మొలక వచ్చింది. కూలీ ఖర్చులు, ఎరువులు, ట్రాక్టర్ కిరాయి డబ్బులు కూడా వచ్చేలా లేవు. కన్నీళ్లు తప్పా.. ఏమీ మిగలలేదు.
పరిహారం ఇవ్వాలని వేడుకోలు..
ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులకు నష్టం వాటిల్లుతూ వస్తోంది. గతేడాది వానాకాలం సీజన్‌తో దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత కాత, పూత దశలో దంచికొట్టిన వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈసారి సైతం అధిక వర్షాలు రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా వరి, పత్తి రైతులకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 36,970ఎకరాల్లో పంట నష్టం
కోత దశలో వరద నీటిలో నేలవాలిన వరి
ఏరే దశలో చేన్లలోనే తడిసి ముద్దయిన పత్తి
నాగర్‌కర్నూల్ జిల్లాలో అధిక ప్రభావం
ఆ తర్వాత వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో..
నష్ట పరిహారం ఇవ్వాలని అన్నదాతల వేడుకోలు
 
							రైతన్నకు కన్నీరే దిక్కు!
 
							రైతన్నకు కన్నీరే దిక్కు!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
