 
															ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టండి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం ఐదు నెలలే మిగిలిందని, బకాయిలతో కలుపుకొని మొత్తం రూ.49 కోట్ల ఆస్తిపన్నుకు రూ.12.50 కోట్లే వసూలు కావడమేమిటని ప్రశ్నించారు. ఇందులో రెసిడెన్షియల్ కింద 15 శాతం, కమర్షియల్ కింద 40 శాతమే వచ్చిందన్నారు. గడువులోగా కనీసం రూ.17 కోట్లు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే గ్రాంట్‌కు అర్హత దక్కుతుందన్నారు. ముఖ్యంగా వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లందరూ ప్రతిరోజూ తమకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అంతకుముందు తన చాంబర్‌లో ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతోనూ ఆయన సమీక్షించారు. ఇదిలా ఉండగా ఆస్తిపన్ను తక్కువగా వసూలు కావడంతో ఆర్‌ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్యలకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సమావేశంలో ఏఎంసీ అజ్మీర రాజన్న, ఆర్‌ఐలు అహ్మద్‌షరీఫ్, రమేష్, టి.నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
