వివాహేతర సంబంధం బయటపడుతుందనే..
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు
నాగర్‌కర్నూల్ క్రైం: కొల్లాపూర్ మండలం మంచాలకట్ట శివారులో ఉన్న సాకలి రాముని గుట్టవద్ద ఈ నెల 8న జరిగిన మహిళ హత్యను పోలీసులు ఛేదించారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయపడుతుందనే గొంతు నులిమి, ఒంటిపై పెట్రోలు పోసి హత్య చేసినట్లు గుర్తించారు. బుధ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పూర్తి వివరాలు వెల్లడించారు. కొల్లాపూర్‌లోని ఇందిరానగర్‌కాలనీకి చెందిన కోమరి స్వర్ణలత (32)కు 15 ఏళ్ల కిందట వివాహం జరగగా ఏడేళ్ల కిందట భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉండేది. ఇదే క్రమంలో అదే కాలనీలో ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి 23 ఏళ్ల బోగిమొళ్ల విజయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దిరోజుల తర్వాత విజయ్‌కుమార్ మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్వర్ణలతకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను విజయ్‌కుమార్ తల్లిదండ్రులకు చూపిస్తానంటూ రెండు, మూడుసార్లు భయపెట్టింది. దీంతో ఎప్పటికై నా ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని విజయ్‌కుమార్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 8న స్వర్ణలతకు ఫోన్‌చేసి మాట్లాడేందుకు పెంట్లవెల్లికి రావాలని చెప్పడంతో బస్సులో వచ్చింది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై మంచాలకట్ట వద్ద ఉన్న పుష్కరఘాట్‌కు చేరుకొని అక్కడ గొడవపడ్డారు. అనంతరం గ్రామ సమీపంలోని సాకలిరాముని గుట్టకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు మంచాలకట్టకు వెళ్లి కిరాణ దుకాణంలో అగ్గిపెట్ట, రెండులీటర్ల పెట్రోల్‌తో పాటు సిగరేట్ తీసుకొచ్చి మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చి గుర్తుపట్టలేని విధంగా అయ్యాక అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ నెల 13న మహిళ మృతదేహాన్ని గుర్తించిన పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫొటోతో గుర్తించిన స్వర్ణలత తండ్రి ఈ నెల 27న పోలీసులను ఆశ్రయించారు. హత్య జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో పాటు సీసీ కెమెరాల రికార్డుల ఆధారంగా విజయ్‌కుమార్ హత్య చేశాడని నిర్ధారించుకొని కొల్లాపూర్‌లో బుధవారం అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడని వివరించారు. హత్య కేసు త్వరగా ఛేదించిన డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, సీఐ మహేష్‌తో పాటు ఎస్సైలు రామన్‌గౌడ్, రిషికేష్‌ను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


