కురుమతిరాయుడి సేవలో.. అమరచింత పద్మశాలీలు
● నేటి అలంకారోత్సవంలో పట్టువస్త్రాల సమర్పణ
అమరచింత: కురుమూర్తిరాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక మార్కండేయ ఆలయ సత్రంలో పట్టణ పద్మశాలీ కులస్తులు ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా నిష్టతో నేత పనులు చేపట్టారు. ఆదివారం జరిగే అలంకారోత్సవానికి ఇక్కడి నుంచి భక్తిశ్రద్ధలతో ఆలయానికి వస్త్రాలను తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. వీటిని తలపై పెట్టుకొని ఆలయం వరకు తీసుకెళ్లేందుకు లక్కీడిప్ ద్వారా కులస్తుల్లో ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న తెలిపారు.
ఇలవేల్పునకు కానుక..
ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పట్టణ పద్మశాలి కులస్తులు వస్త్రాలు నేసి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాలానుగుణంగా నూలుకు బదులు పట్టు అందుబాటులోకి రావడంతో స్వామివారికి పట్టు పంచ, గౌను, అమ్మవారికి పట్టు చీరను ప్రత్యేక మగ్గంపై నిష్టతో స్వయంగా తయారుచేసి సమర్పిస్తున్నారు. పద్మశాలి కులస్తులందరూ భాగస్వాములై ప్రతి ఇంటి నుంచి కొంత నగదు సేకరించి వస్త్రాల తయారీకి వినియోగిస్తారు.
గతంలో కోనేటిపై..
60 ఏళ్ల కిందట కోటకొండ కుర్మన్న, కొంగరి చిన్నయ్య, నరాల సింగోటం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని మగ్గంపై వస్త్రాలను తయారుచేసి ఆలయ అర్చకులకు అందించి వారిచ్చే అతిథ్యాన్ని స్వీకరించేవారు.
కురుమతిరాయుడి సేవలో.. అమరచింత పద్మశాలీలు


