నేడు అలంకారోత్సవం
చిన్నచింతకుంట/ఆత్మకూర్: అమ్మపూరం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అలంకారోత్సవం నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లోని ఎస్‌బీఐ లాకర్‌లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలను తీసుకొచ్చేందుకు ఆలయ కమిటీ సభ్యులు వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు, బాణసంచా కాలుస్తూ ఊరేగింపుగా ఆభరణాలు తీసుకురానున్నారు. బ్యాంకు నుంచి ఆత్మకూర్ చెరువు కట్ట వరకు మధ్యనగాడి వంశస్తులు స్వామివారి ఆభరణాలను తలపై పెట్టు కుని వస్తారు. అక్కడ శివుడికి పూజలు చేసిన తర్వా త పోలీసు భద్రత మధ్య మదనాపురం మండలం కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మపూరంలోని రాజ శ్రీరాంభూపాల్ ఇంటికి చేరుస్తారు. అక్కడ ఆనవాయితీ ప్రకారం గంటపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మపూరం నుంచి నంబీ వంశస్తులు తలపై పెట్టుకొని అంభోరు మధ్యన కాలినడకన ఆభరణాలను కురుమూర్తి కొండలకు చేరుస్తారు. ఈ కార్యక్రమం కనులపండువగా సాగుతుంది. స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అధికారుల సమక్షంలో ఆభరణాలను ఆలయ పూజారులకు అందజేస్తారు. స్వామివారి కిరీటం, హస్తాలు, పాదుకలు, కోర మీసాలు, కెంపు, ముత్యాలహారం, కనకహారాలతో పాటు అనేక రకాలైన ఆభరణాలను కాంచనగుహలో కొలువుదీరిన శ్రీనివాసుడికి అలంకరిస్తారు. ఆతర్వాత స్వామివారు స్వర్ణకాంతులతో కనిపిస్తారు. ఈ సందర్భంగా కాంచనగుహ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది.
హాజరుకానున్న మంత్రి, ఎమ్మెల్యేలు
కురుమూర్తిస్వామి అలంకారోత్సవానికి రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, మేఘారెడ్డి హాజరవుతారని ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా తెలిపారు. అదే విధంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సంఘం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్‌తో పాటు అన్ని పార్టీల నాయకులు హాజరుకానున్నారు.
100మంది పోలీసులతో బందోబస్తు
కురుమూర్తిస్వామి అలంకారోత్సవం సందర్భంగా వనపర్తి ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 15 మంది ఏఎస్‌ఐలతో పాటు 100 మంది పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ శివకుమార్ తెలిపారు. అలంకారోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు సహకరించాలని కోరారు.


