కారు బోల్తా పడి వ్యక్తి మృతి
● మరో నలుగురికి గాయాలు
మానవపాడు: అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జాతీయ రహదారి –44పై మానవపాడు శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రకాంత్, స్థానికుల కథనం ప్రకారం.. సులోమన్, మనోజ్‌కుమార్, బేబి స్టెఫి, ఫియాపాప, మేరీకళావతి(60) కారులో కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. అయితే, మానవపాడులోని శివారులోకి వచ్చేసరికి కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న డివైడర్‌ను, అనంతరం ఓ చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో కారులోని ఐదుగురిలో మేరీకళావతికి తీవ్రగాయాలై మృతి చెందగా.. సులోమన్, మనోజ్‌కుమార్, బేబి స్టెఫి, ఫియాపాపకు గాయాలైనట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సంఘటనపై బేబీ స్టెఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కల్వకుర్తి రూరల్: కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై మండలంలోని మార్చాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. పట్టణంలోని బాలరాంనగర్‌కు చెందిన ఈశ్వర్‌రెడ్డి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి మతిస్థిమితంలేదని కాలనీవాసులు తెలిపారు. కొన్నిరోజులు సూర్యలత కాటన్ మిల్లు పనిచేయడంతోపాటు రిక్షా తొక్కుతూ జీవనం సాగించాడని చెప్పారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
యువకుడి ఆత్మహత్య
నాగర్‌కర్నూల్ క్రైం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. జిల్లాకేంద్రంలోని ఎర్రగడ్డకాలనీకి చెందిన గాజుల మధు (22) ఓ ఎలక్ట్రానిక్ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. గాజుల మధు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనకు సంబందించి ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
గడ్డిమందు తాగి వ్యక్తి బలవన్మరణం
గోపాల్‌పేట: గడ్డిమందు తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. ఏదులకు చెందిన కొమ్ము ఆంజనేయులు(52)కు ఏదుల ప్రాజెక్టు వద్ద వ్యవసాయ పొలం ఉండేది. ప్రాజెక్టులో పొలం పోయింది. జీవనోపాధికి పొలం లేకపోవడంతో అదే పొలంలో ఆంజనేయులు మినుముల పంట వేశాడు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఇటీవల పంటలో నుంచి లారీలు వెళ్లడంతో నష్టపోతానని కాంట్రాక్టరుతో వాదోపవాదాలు జరిగాయి. గురువారం తీవ్ర మనస్తాపానికి గురై పొలంవద్ద గడ్డిమందు తాగాడు. అనంతరం కుటుంబ సబ్యులకు ఫోన్‌చేసి తాను గడ్డిమందు తాగానని చెప్పగా.. వెంటనే వనపర్తి, మహబూబ్‌నగర్ అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య అంజనమ్మ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
చికిత్సపొందుతూ మహిళ మృతి
ఆత్మకూర్: పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిందని ఎస్‌ఐ నరేందర్ తెలిపారు. మండలంలోని మేడేపల్లికి చెందిన భారతమ్మ(30)కు తిప్డంపల్లికి చెందిన శివతో 13 ఏళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. శుక్రవారం భర్తతో గొడవపడ్డ భారతమ్మ మేడేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో పడిఉన్న తమ కూతురుని చూసిన కుటుంబ సభ్యులు ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు బోల్తా పడి వ్యక్తి మృతి


