
ఆటో బోల్తా
జడ్చర్ల: జడ్చర్ల నుంచి గంగాపూర్ వైపు వెళ్తున్న ఆటో గంగాపూర్ ఎల్లమ్మ దేవాలయం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఆటోలో ఉన్న 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. మిగతా వారిని ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపారు. ప్రమాద సమయంలో ఆటోలో దాదాపు 15 మంది దాకా ఉన్నారు. గాయపడిన వారిని వైద్యం కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో లక్ష్మన్ నాయక్ తండాకు చెందిన విద్యార్థి మధు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. గాయాలైన రాములు, ప్రవళిక, తదితర విద్యార్థులకు జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. మరో వృద్ధుడు కృష్ణయ్య కాలుకు తీవ్రంగా గాయమైంది. గాయపడిన వారు మండల పరిధిలోని లింగంపేట, కోడ్గల్ గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, తదితరులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.