
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి
జడ్చర్ల: మహిళా సంఘాల్లోని సభ్యులు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగాలని, ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. తమ ప్రజా ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తుందని, స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల సభ్యులు ఇంద్ర శక్తి యూనిట్లు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు వంటి యూనిట్లకు చేయూతనిస్తామన్నారు. సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకుని లబ్ధి పొందాలని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.3.36 కోట్ల వడ్డీ రాయితీ చెక్కు, బీమాకు సంబంధించి రూ.18.23 లక్షలు, ప్రమాద బీమా రూ.30 లక్షలు, ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ రుణాలు రూ.16.50 కోట్లు చెక్కులను అందజేశారు. అలాగే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.