
పాలమూరులో జోరు వాన
● లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరదనీరు
● పిడుగుపాటుతో ఒకరు మృతి
● పంటలకు ఊపిరిపోసిన వరుణుడు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/మహబూబ్‌నగర్ క్రైం/దేవరకద్ర/మహబూబ్‌నగర్ రూరల్: జిల్లావ్యాప్తంగా శనివారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సాయంత్రం 40 నిమిషాల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో పెద్ద నాలాలలో వరద ఉధృతంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, రామయ్యబౌలి, శివశక్తినగర్, బాలాజీనగర్, గణేష్‌నగర్, కురిహినిశెట్టికాలనీ, లక్ష్మీనగర్‌లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. శ్రీనివాసకాలనీలో కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జ్ ఎంఈ సందీప్‌ఈ ప్రాంతాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. పాటుకాల్వల ద్వారా పెద్దచెరువులోకి వరద ఉధృతంగా వచ్చింది.
● దేవరకద్రలో కురిసిన వర్షం వల్ల మురుగు కాల్వలు నీటితో నిండిపోవడంతో కొత్త బస్టాండ్ ప్రాంతంలో షాపుల ముందు నీరు నిలిచింది. గూరకొండ రోడ్, రాయచూర్ రోడ్ పరిసర నివాస ప్రాంతాల మధ్య భారీగా నీరు నిలిచిపోయింది.
● జిల్లాకేంద్రంలోని ఓ యువకుడు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాడు. న్యూమోతీనగర్‌కు చెందిన దాసరి సమ్మయ్య(16) చేపలవేటకు వెళ్లగా.. వర్షం పడే సమయంలో ఓ చెట్టుకిందికి వెళ్లాడు. ఈ క్రమంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరోయువకుడు అంజి గాయపడగా.. జనరల్ ఆస్పత్రికి తరలించారు.
రైతన్నల్లో హర్షం
వానాకాలం ఆరంభంలో వేసిన పంటలు ఎండిపోతున్న తరుణంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఊపిరి పోశాయి. ముఖ్యంగా పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు ఊరట చెందుతున్నారు. జిల్లాలో 3,46,830 ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 1,94,983 ఎకరాలలో మాత్రమే సాగుకు నోచుకుంది. అందులో వర్షాధార పంటలు కూడా కోల్పోయే దశలో ఉండగా.. ఈ వర్షం ఆ పంటలకు పునర్జీవం వచ్చేలా చేసింది.

పాలమూరులో జోరు వాన