
మూతబడ్డ ‘ఎత్తిపోతల’ భవనం కూల్చివేత
కృష్ణా: మండలంలోని గుడెబల్లూర్ 2వ ఎత్తిపోతల పథకం భవనాన్ని ఓ రైతు ఆదివారం ఉదయం కూల్చివేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా.. గుడెబల్లూర్ ఎత్తిపోతల పథకంలోని 2వ ఎత్తిపోతల పథకం 20, 25ఏళ్లుగా ఉపయోగంలేక మూతపడింది. అప్పట్లో ఐడీసీ వారు నిర్మించిన ఈ భవనంలో మోటర్లు, ఇతర పంపింగ్ సామగ్రిని ఉంచేవారు. కాలక్రమేణ భవనం మూతపడడంతోపాటు శిథిలావస్థకు చేరింది. కాగ ప్రతినిత్యం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు అక్కడ మద్యం తాగేందుకు అడ్డాగా మార్చుకున్నారు. ఇది గమనించిన ఆ భవనం పక్కన ఉన్న పొలం రైతు హుస్సేన్ పోకిరీల బాధనుంచి తప్పించుకునేందుకు ఆ భవనాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు శివరాజ్, ఆయకట్టు రైతులు స్థానిక పోలీస్‌స్టేషన్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార ప్రభుత్వం సాగునీటికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుండడంతో ఈ మూతపడ్డ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించేందుకు ఓవైపు తాము కృషిచేస్తుంటే ఇప్పుడిలా భవనం కూల్చివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెందిన భవనాన్ని ఇష్టానుసారం కూల్చివేసిన వ్యక్తితో పాటూ జేసీబీనీ సీజ్ చేయాలని, అలాగే డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయకట్టు రైతులు
ఇరిగేషన్‌శాఖ, పోలీసులకు ఫిర్యాదు