
ఎలుగుబంటి దాడిలో తోకల మల్లయ్య మృతి
మన్ననూర్: అప్పాపూర్ గ్రామానికి చెందిన తోకల మల్లయ్య కొన్ని రోజుల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో అదృశ్యమైన ఘటన తెలిసిందే. 12 రోజులుగా మల్లయ్య బంధువులు ఆయన జాడ కోసం వెతుకుతున్న క్రమంలో గ్రామానికి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో గురువారం ఓ చెట్టు కింద కుళ్లిపోయిన శవాన్ని వారు గుర్తించారు. ఈ క్రమంలో మృతుడి భార్య తోకల లింగమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి లింగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో లింగాల ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు, వైద్యులు, అటవీశాఖ సిబ్బంది శుక్రవారం ఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల సూచన మేరకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఇది ఇలా ఉండగా మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఎలుగుబంటి దాడి చేయడంతోనే మల్లయ్య మృతి చెంది ఉండవచ్చని అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మృతికి సంబంధించిన విషయాలు నిర్ధారణ అవుతుందని వైద్య సిబ్బంది తెలిపారు.