
అర్హులకు దక్కేనా..?
●
ఐదేళ్లుగా అసంపూర్తిగానే..
బోయలకుంట కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణపను లు చేపట్టి దాదాపు ఐదేళ్లయినా ఇప్పటి వరకు పూ ర్తి స్థాయిలో నిర్మించలేదు. వెంటనే పనులు పూర్తి చేసి తమకు ఇళ్లు కేటాయించాలి.
– యాదయ్య,
దరఖాస్తుదారుడు, బోయలకుంట
త్వరలో అర్హులను
ఎంపిక చేస్తాం
ఎర్రగుట్టలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకున్నారు. వీరిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. తమ దగ్గర ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని త్వరలోనే గుర్తించేలా చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల
జడ్చర్ల: డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కనీస మౌళిక వసతుల కల్పనతో అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు జడ్చర్ల నియోజకవర్గంలో ఎక్కడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించలేదు. అసలు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో కూడా స్పష్టత లేదు. దీంతో లబ్ధిదారుల ఎంపికలో అయోమయం చోటు చేసుకుంది.
2,700 ఇళ్లు మంజూరు
జడ్చర్ల నియోజకవర్గంలో దశల వారీగా ఇప్పటివరకు 2,700 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఎక్కువగా జడ్చర్ల మండలంలోనే 2132 ఇళ్లు నిర్మించారు. అయితే కావేరమ్మపేట, బండమీదిపల్లి, కోడ్గల్, తదితర గ్రామాల్లో మినహాయిస్తే ఎక్కడా డబుల్ బెడ్‌రూం ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదు. మిడ్జిల్, బాలానగర్, నవాబ్‌బ్‌పేట, రాజాపూర్ మండలాల్లో సైతం డబుల్ బెడ్‌రూం ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరుకు సంబంధించి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 3వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ డిమాండ్‌కు సరిపడా గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేకపోయింది. పూర్తయిన ఇళ్లను సైతం అర్హులకు అందించలేదు. తాజాగా అర్హులను గుర్తించి ఇళ్లను కేటాయించడంలో అధికారులు ఎంతమేరకు పారదర్శకతను పాటిస్తారో వేచి చూడాల్సి ఉంది.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురుచూపులు
జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 2వేల ఇంటి నిర్మాణాలు పూర్తి
నేటికీ కేటాయించని వైనం
ఎర్రగుట్టలో మాత్రం యథేచ్ఛగా
ఇళ్ల ఆక్రమణ
దరఖాస్తుల వెల్లువ
తాజాగా తెరపైకి..
ఎర్రగుట్ట ప్రాంతంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఆక్రమించుకున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆదేశించడంతో తాజాగా వివాదం తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్ నాయకులు డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇష్టానుసారంగా అమ్ముకున్నారని సాక్షాత్తు ఎమ్మెల్యే ఆరోపించడమేగాక సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి వారిని ఖాళీ చేయించాల్సిందిగా ఆదేశించారు. దీంతో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పందించి తమ పార్టీ వారు ఎవరికి ఇళ్లను అమ్మలేదని.. ఒకవేళ అమ్మితే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. అర్హులకు ఇళ్లను ఇవ్వాలని ఓ వైపు ఎమ్మెల్యే, మరో వైపు మాజీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నా ఖాళీ చేయించిన తర్వాత అవినీతి అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా అధికారులు, పాలకులు స్పందించి అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

అర్హులకు దక్కేనా..?

అర్హులకు దక్కేనా..?