
బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అర్థరహితం
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి ఎత్తిపోత పథకం (కేఎల్‌ఐ) కాల్వ పనులపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్థ రహితమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కేఎల్‌ఐపై చిత్తశుద్ధి ఉండటంతోనే మోటార్లు ప్రారంభించామని చెప్పారు. ప్రజాప్రతినిధిగా ఓడిన తర్వాత టూరిస్టుగా వచ్చిపోతున్న వారికి కేఎల్‌ఐపై సరైన అవగాహన లేకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. డి–63, 64 కాల్వ పనుల్లో కొన్ని మరమ్మతులు ఉన్నాయని.. వాటిని సరిచేస్తూ నియోజకవర్గంలోని మాడ్గుల మండలం నాగిళ్ల వరకు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. కల్వకుర్తి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిక నిధులు కేటాయిస్తున్నారని వివరించారు.
11న మంత్రుల పర్యటన..
నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.189 కోట్లు కేటాయించిందని.. పట్టణంలో నూతనంగా నిర్మించే 100 పడకల ఆస్పత్రి, వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. అనంతరం పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సమావేశంలో నాయకులు ఆనంద్‌కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మోతీలాల్, శ్రీనివాస్‌రెడ్డి, రాహుల్, భూపతిరెడ్డి, రాజేష్‌రెడ్డి, నర్సింహ, కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి