
నిలిచిన మధ్యాహ్న భోజనం
గట్టు: మండలంలోని చాగదోణ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలలో మూడు రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. సోమ, మంగళవారం కొందరు విద్యార్థులు ఇళ్ల నుంచి టిఫిన్ బాక్స్‌ల్లో భోజనం తెచ్చుకోగా.. మరికొందరు సాయంత్రం వరకు పస్తులు ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామ యువత మహేష్‌గౌడ్, ప్రవీణ్, కార్తీక్, హరిబాబు, విజయ్‌కుమార్, నర్సన్న తదితరులు మంగళవారం పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. శుక్రవారం 200 విద్యార్థులు పాఠశాలకు హాజరుకాగా.. కేవలం 170 మందికి మాత్రమే నీళ్ల చారుతో భోజనం వడ్డించారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా.. వంట ఏజన్సీ నిర్వాహకుల సమస్య కారణంగా రెండ్రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచినట్లు తెలిపారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని, అప్పటి వరకు విద్యార్థులు ఇంటి నుంచి భోజన బాక్సులు తెచ్చుకోవాలని చెప్పినట్లు వివరించారు.