
నగర సమస్యలను పరిష్కరిస్తాం
● మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన
● రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రజలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయా డివిజన్ల పరిధిలో తిష్ట వేసిన సమస్యలను స్థానికులు ప్రస్తావించగా వీలైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని, కుక్కల బెడదను నివారించాలని, పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి..
● ప్రశ్న: కోస్గి రోడ్డుపై ఎక్కడికక్కడే గుంతలు పడ్డాయి. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి పాదచారులు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– వెంకట్‌రెడ్డి, మర్లు, మహబూబ్‌నగర్
● కమిషనర్: త్వరలోనే ఈ రోడ్డుకు మరమ్మతు చేయిస్తాం.
● ప్రశ్న: కోయనగర్‌కు వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి వద్ద పెద్ద కాల్వ నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది.
– డి.బాలస్వామి, దొడ్డలోనిపల్లి, మహబూబ్‌నగర్
● కమిషనర్: అక్కడికి వెంటనే పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయిస్తాం.
● ప్రశ్న: ఆంజనేయస్వామి గుడి నుంచి మైసమ్మ దేవాలయం వరకు యూజీడీ కోసం సిమెంట్ పైపులు వేసి మధ్యలో అక్కడక్కడ ఆపేశారు. ఈ పనులు రెండు నెలలుగా నెమ్మదిగా సాగుతున్నాయి. వెంటనే పూర్తి చేయించాలి.
– రాంచంద్రయ్య, శీర్షిక, పాత పాలమూరు వాసులు
● కమిషనర్: ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
● ప్రశ్న: కమ్యూనిటీ హాలు పక్క నుంచి యూడీజీ నిర్మించాలి.
– కేశమోని శారద, పాత పాలమూరు
● కమిషనర్: ఇంజినీరింగ్ అధికారులను పంపి పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.
● ప్రశ్న: అయ్యప్పగుడికి వెళ్లే దారిలో, భాగ్యనగర్‌లోని కింది ప్రాంతం సీసీ రోడ్లు, డ్రెయినేజీలు లేక ఇబ్బందుల పాలవుతున్నాం. దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదు.
– పగడం మల్లేష్ (పద్మావతికాలనీ), శ్రీకాంత్ (భాగ్యనగర్)
● కమిషనర్: క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించి ఈ సమస్యలు పరిష్కరిస్తాం.
ప్రశ్న: గచ్చిబౌలిలోని రెండు మూడు గల్లీలలో రోడ్లు తవ్వి వదిలేశారు. దీంతో లోపలి వరకు చెత్తబండి, ఆటోలు, ఇతర వాహనాలు వచ్చే పరిస్థితి లేదు.
– ఎండీ జమీల్, గోల్ మసీదు ప్రాంతం
కమిషనర్: మీ ప్రాంతంలో త్వరలోనే సీసీ రోడ్లు నిర్మించేలా కాంట్రాక్టర్‌ను ఆదేశిస్తాం.
ప్రశ్న: న్యూటౌన్ చౌరస్తా నుంచి రాజేంద్రనగర్ వరకు ఒకవైపు రోడ్డును తవ్వి వదిలేశారు. 167 ఎన్‌హెచ్‌పై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చౌరస్తా వద్ద ట్రాఫిక్ జాం అవుతోంది.
– సంపత్‌కుమార్, రాజేశ్, జహంగీర్‌బాబా, రాజేంద్రనగర్ వాసులు
కమిషనర్: కాంట్రాక్టర్‌ను పిలిపించి సీసీ రోడ్డును త్వరలో వేయిస్తాం. ట్రాఫిక్ సీఐతో మాట్లాడి వెంటనే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తాం. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ విషయమై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
ప్రశ్న: విలీన గ్రామమైన పాలకొండలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మోరీలను శుభ్రం చేయడం లేదు.
– వెంకటయ్యగౌడ్, పాలకొండ
కమిషనర్: మీ ప్రాంతంలో రోడ్లు బాగు చేయిస్తాం. పారిశుద్ధ్య సిబ్బందిని పంపి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం

నగర సమస్యలను పరిష్కరిస్తాం