
‘ఇళ్ల పట్టాలను గుంజుకోవాలని చూస్తోంది’
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నిరుపేదలకు గతంలో ఇచ్చిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల పట్టాలను వారి నుంచి గుంజుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి చట్టబద్ధత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమవుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభివృద్ధిలో మహబూబ్‌నగర్ వెనకబడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోయినం అనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, పోలీసులు కూడా అతిగా వ్యవహరించకుండా చట్ట ప్రకారం పనిచేయాలని హితవు పలికారు. తప్పులను సరి చేసుకొని పార్టీ బలోపేతం చేయడంతోపాటు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ వైస్‌చైర్మన్ గణేశ్, ముడా మాజీచైర్మన్ వెంకన్న, నాయకులు బెక్కం జ నార్దన్, శివరాజ్, రెహమాన్, అనంతరెడ్డి, నవకాంత్, సాయిలు, ఇమ్రాన్, రాజు పాల్గొన్నారు.