
ఎస్సీ, ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జెడ్పీ, డీఆర్‌డీఓ, జిల్లా పంచాయతీ శాఖలలో ఎస్సీ, ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్‌లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ల పాటించాలని, సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు పని కల్పించడంలో చొరవ చూపాలని, అర్హులైన వారికి జాబ్ కార్డులు ఇప్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీలకు పని దినాలను తక్కువ కాకుండా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు ఇవ్వాల ని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలతో అత్యధికంగా సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను నిర్లక్ష్యం చేయవద్దని, రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి అందేలా చూడాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారధి పాల్గొన్నారు.