పచ్చిరొట్ట.. ప్రయోజనాలెన్నో! | - | Sakshi
Sakshi News home page

పచ్చిరొట్ట.. ప్రయోజనాలెన్నో!

Jun 28 2025 8:48 AM | Updated on Jun 28 2025 8:48 AM

పచ్చి

పచ్చిరొట్ట.. ప్రయోజనాలెన్నో!

సాగువిధానం..

ప్రధానంగా వరిసాగు చేసే రైతులు దీన్ని సాగు చేసుకుంటారు. వరి నారుమడులకు ముందే పచ్చిరొట్టను సాగు చేసుకోవాలి. మే, జూన్‌నెలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ముందుగా దుక్కిని దున్ని విత్తనాలను చల్లుకోవాలి. జీలుగ విత్తనాలు ఎకరాకు 12కిలోలు, జనుము 15, పెసర 8, పల్లి పెసర 10, అలసంద 12 కిలోల విత్తనాలను చల్లుకోవాలి.

అధిక దిగుబడులు వస్తాయి

పచ్చిరొట్ట సాగుతో భూమి సారవంతంగా అవుతుంది. సాగుచేసిన పంటలకు సేంద్రియ ఎరువులతోపాటు నత్రజని అందిస్తుంది. పంటలు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదిగి అధిక దిగుబడులు వస్తాయి. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి తప్పనిసరిగా పచ్చిరొట్ట సాగును చేసుకోవాలి.

– రాజేశ్‌ ఖన్నా, ఏఓ, చిన్నచింతకుంట

చిన్నచింతకుంట: అధిక దిగుబడులే లక్ష్యంగా రైతులు పంటసాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతినడమే కాకుండ ఆహార పంటలు కలుషితమవుతున్నాయి. క్రమంగా పంటలో సూక్ష్మ స్థూల పోషకాలు లోపిస్తున్నాయి. అంతేకాక చీడపురుగుల ఉధృతి పెరుగడంతో రైతుకు పెట్టుబడుల భారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. జీలుగ, జనుము, పెసర, పిల్లిపెసర, అలసంద వంటివి సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించుకోకుంటే భవిష్యత్‌లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేతలు హెచ్చరిస్తున్నారు.

ప్రధానంగా 16రకాలు

పచ్చిరొట్ట సాగులో ప్రధానంగా 16రకాలు ఉండగా ఎక్కువగా రైతులు జీలుగ, జనుము, పెసర, పిల్లిపెసర వంటివి సాగు చేస్తారు. ఇది స్థూల సేంద్రియ ఎరువుగా తయారవుతోంది. ఇది నేలకు సేంద్రియ ఎరువుతోపాటు నత్రజనిని అందిస్తుంది. వీటిని మొగ్గ దశవరకు పెంచి భూమిలో కలియ దున్నుతారు. ఈ మొక్కలు లెగ్యుం జాతికి చెందినవి. వీటి ఏర్లలోని గుడిపెలు నత్రజనిని స్వీకరించి మళ్లీ సాగు చేసిన పంట మొక్కకు అందేలా తోడ్పడుతాయి. పచ్చరొట్ట పైర్లు పూత దశకు రావడానికి 40లేదా 50రోజుల సమయం పడుతుంది. ఇది కుళ్లే సమయంలో కొన్ని రకాల వాయువులు తయారవుతాయి. వాటి వల్ల నాటిన మొక్కకు హాని కల్గిస్తుంది. కాబట్టి పచ్చిరొట్ట కలియ దున్నిన రెండు వారాలకు మొక్కను నాటుకోవాలి.

పచ్చిరొట్టతో లాభాలు

పచ్చిరొట్ట ప్రధానంగా వరి పంటకు ముందస్తుగా సాగు చేసుకోవాలి. ఇది నేల సారవంతంగా తయారు చేస్తుంది. నేల భౌతిక స్థితిని మెరుగుపరిచి భూమిని గుల్లగా మారుస్తాయి. నేలలో నీరు ఇంకే గుణాని పెంచుతాయి. నేల కోతకు గురికాకుండా కాపాడుతాయి. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేస్తాయి. జీవ రసాయనిక చర్యలతో నేలసారం పెరగడంతోపాటు పంటలు సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి. సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే హార్మోన్లతో మొక్కల పెరుగుదల వృద్ధి చెందుతుంది. పంటల నాణ్యత కూడా పెరుగుతుంది. చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడుతాయి. పంట మార్పిడికి సహాయపడుతాయి. పురుగులు, తెగుళ్ల బెడదను తగ్గించి సస్యరక్షణ ఖర్చును కూడా నియంత్రిస్తాయి.

భూమి సారం, పంటలకు సంపూర్ణ ఆరోగ్యం

సూక్ష్మజీవుల వృద్ధి, చీడపీడల నియంత్రణ

అధిక దిగుబడి సాధించేందుకు అనుకూలం

పచ్చిరొట్ట.. ప్రయోజనాలెన్నో! 1
1/1

పచ్చిరొట్ట.. ప్రయోజనాలెన్నో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement