బావిలో పడి మహిళ మృతి
బల్మూర్: బావిలో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని బాణాలలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రాజేందర్, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఇమ్మడి చిన్నమ్మ (45) మతిస్థిమితం కోల్పోయి తిరుగుతుండేది. రెండ్రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు వెదుగుతుండగా సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని ఓ పాడుబడ్డ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. కుమారుడు అర్జున్ ఫిర్యాదు మేరకు కేసు మంగళవారం నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ వివరించారు.
ఉరేసుకుని వ్యక్తి మృతి
గోపాల్‌పేట: వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన ఘటన ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గోపాల్‌పేట ఎస్‌ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుణమోని రేణుక, గుణమోని రాములు(40) భార్యాభర్తలు. మంగళవారం ఉదయం డబ్బుల విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాములు పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించేలోపు మరణించడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
జడ్చర్ల: విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని గోప్లాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కావేరమ్మపేటకు చెందిన వెంకటేశ్ యాదవ్ (45) టైల్స్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మంగళవారం గోప్లాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో టైల్స్ పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టైల్స్ వేసేందుకు వినియోగించిన యంత్రం వైర్‌ను ప్లగ్ తీయకుండా చుడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్ యాదవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
వివాహిత బలవన్మరణం
లింగాల: ఆర్థిక ఇబ్బందులతో వివాహిత వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని చెన్నంపల్లికి చెందిన వల్లెపు సుజాత (43) మండల కేంద్రం సమీపంలోని అప్పాయపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్దవాగులో శవమై కనిపించింది. ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. పెద్దవాగులో మృతదేహాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్త సలేశ్వరం పదేళ్ల కిందటే చనిపోగా.. అప్పులు చేసి పెద్దకుమార్తె పెళ్లి చేసిందని, పెళ్లికి చేసిన అప్పు ఎలా తీర్చాలి, రెండో కుమార్తె పెళ్లి ఎలా చేయాలనే బెంగతో ఆత్మహత్య చేసుకొని ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
కొత్తకోట రూరల్: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అప్పరాలలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ కథనం మేరకు.. మండలంలోని పాలెం గ్రామానికి చెందిన సువర్ణకు అప్పరాలకు చెందిన సందెపాగ రవితో 22 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉండగా.. ఇటీవల కుమార్తె వివా హం చేశారు. గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఓమారు సువర్ణ తల్లిగారింటికి వెళ్లింది. పెద్దమనుషులు ఆనంద్‌ను మందలించి సువర్ణను పంపించారు. ఈ నెల 8న గొడవ పడగా పురుగుమందు తాగింది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి, అటు నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అ క్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. అన్న మూలింటి రాములు ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
శాంతినగర్ : తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ కొడుకు మృతి చెందిన ఘటన స్థానిక రాఘవేంద్ర కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. శాంతినగర్ రాఘవేంద్ర కాలనీలో ఉండే అమర్నాథ్ (53) తండ్రి గత నెలలో మరణించాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అమర్నాథ్ గత నెల 29న రాత్రి పొలం వద్ద గడ్డి మందు తాగి కూతురుకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన పొలం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు బాధితడిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
బావిలో పడి మహిళ మృతి


