మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణం
అయిజ: పంట పొలానికి బాట లేదని చెప్పినందుకు మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం అయిజ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. అయిజ పట్టణానికి చెందిన దేవర మహేష్ (45) 393 సర్వే నంబర్‌లో ఉన్న తన పొలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, కొందరు వ్యక్తులు మీకు ఇటువైపుగా బాట లేదని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన మహేష్ ఇంటికి వెళ్లి ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. మహేష్ మృతదేహాన్ని బాట ఇవ్వమని చెప్పిన వారి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
చెరువులో మునిగి వ్యక్తి మృతి
గండీడ్/మహమ్మదాబాద్: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. నారాయపేట జిల్లా కోస్గి మండలం మల్‌రెడ్డిపల్లికి చెందిన అలికె మొగులయ్య(45)ను అదే గ్రామానికి చెందిన గొల్ల నర్సయ్య గొర్రెలు కడగడానికి గండీడ్ మండలంలోని వెన్నాచేడ్‌లో పెద్దచెరువుకు వెళ్దామని చెప్పాడు. ముందుగా అనుకూలంగా ఉందో.. లేదో చూసి వద్దామని చెప్పాడు. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో మరొకరితో కలిసి మొగులయ్య వెన్నాచేడ్‌లోని పెద్దచెరువుకు చేరుకున్నాడు. చెరువు పెద్ద తూము వద్ద లోతు చూద్దామని నీటిలోకి దిగాడు. అక్కడ ఎక్కువ లోతు ఉండడంతో మునిగిపోయాడు. బయట ఉన్న మిగతావారు మొగులయ్య పైకి రాకపోవడంతో అనుమానం వచ్చి నీటిలో దిగి బయటికి లాగారు. అప్పటికే మొగులయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
యువకుడి ఆత్మహత్య
మన్ననూర్: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య కాలనీకి చెందిన చంద్రకాంత్ (30) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రజిత తెలిపిన వివరాల మేరకు.. చంద్రకాంత్ శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందాడు. ఏడాది క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చంద్రకాంత్ జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసుకొని పోస్టుమర్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం
మహమ్మదాబాద్: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలోని కంచన్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోతుల అశోక్(24) గత రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గ్రామంలో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన అశోక్ కొన్నిరోజులుగా మహబూబ్‌నగర్‌లో ఉంటూ ఎలాంటి కూలీ పనిచేయకుండా ఉంటున్నాడు. దీంతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొని మనస్తాపానికి గుర య్యాడు. శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యు లు స్థానిక జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.


