వనరుల దోపిడీ కోసమే ఎన్‌కౌంటర్లు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వనరుల దోపిడీ కోసమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో అంతం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ ఆరోపించారు. సోమవారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులను ఏరివేసేందుకు ఆపరేషన్ కగార్‌తో బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని, కనీసం వారి మృతదేహాలను కూడా అప్పగించకుండా పైశాచికానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీగా ఉన్న పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరుపుతున్న కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్రం మిత్ర దేశంగా భావిస్తున్న అమెరికా పాలకవర్గం నేడు భారతదేశానికి యాజమాన్య దేశంగా రూపాంతరం చెందిందని వాపోయారు. గతంలో జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధ కాలంలో ఇందిరాగాంధీ అమెరికా ప్రభుత్వం అనుసరించిన పెత్తన ద్వందనీతిని వ్యతిరేకిస్తూ బహిరంగంగా మీడియా సమావేశం బహిష్కరించిందన్నారు. కానీ ప్రధాని మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద అమెరికాకు మోకరిల్లడం యావత్ భారతదేశ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హునికి రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా ఆర్థిక చేయుత అందించాలని కోరారు. తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీలను, వ్యక్తులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొక్కి పెట్టిందని, తెలంగాణ సబండ వర్గాల సమాజం ఆశించిన ఫలితాలు స్వరాష్ట్రంలో నేటికీ సాధించ లేదన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. బాలకిషన్, మాజీ జిల్లా కార్యదర్శి బి.పరమేశ్వర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, రాము, అల్వాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాలనరసింహ


