
‘దేశం అభివృద్ధి చెందితే కాంగ్రెస్ సహించలేదు’
వనపర్తిటౌన్: ప్రధాని మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడుతోందని, దేశం అభివృద్ధి చెందితే ఆ పార్టీ సహించలేదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవిలత ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు విడివిడిగా నిర్వహించడంతో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమలులో ఉండి సంక్షేమ పథకాల అమలుకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల పేరుతో ఏటా రూ.లక్షల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని, ఈ ఆటంకాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఒకే దేశంలో ఒకే ఎన్నిక చట్టం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఓటుకు ఎలక్షన్ కమీషన్ రూ.1,475 ఖర్చు చేస్తుందని, పార్లమెంట్ ఎన్నికలకు రూ. 6లక్షల కోట్లు, శాసనసభ ఎన్నికలకు రూ.3లక్షల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఇవే కాకుండా శాసనమండలి, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, సర్పంచ్, సింగిల్‌విండో ఎన్నికల నిర్వహణకు లెక్కలేనంత డబ్బులు ఖర్చవడంతో పాటు అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, కార్యక్రమం జిల్లా ఇన్‌చార్జ్ అహన్యరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్, ఓబీసీ మోర్చా నాయకుడు బి.శ్రీశైలం, రామన్‌గౌడ్, జ్యోతిరమణ, సుమిత్రమ్మ, కుమారస్వామి, సీతారాములు, పెద్దిరాజు, మనివర్ధన్, బోయల రాము, రాజశేఖర్‌గౌడ్, అశ్వినిరాధ, రాఘవేందర్ గౌడ్, వారణాసి కల్పన, ఎండీ ఖలీల్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు
ప్రజాధనం వృథాను అరికట్టేందుకే జమిలి ఎన్నికలు
బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవి లత