విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌

May 21 2025 12:29 AM | Updated on May 21 2025 12:29 AM

విస్త

విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌

మల్లన్న చెంతకు.. నాలుగు వరుసల రోడ్డు

హైదరాబాద్‌– డిండి, మన్ననూర్‌ రహదారికి మహర్దశ

రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్‌–765 నిర్మాణం

మన్ననూర్‌– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్‌ కారిడార్‌ ఏర్పాటు

స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

మూడు నెలల్లో టెండర్‌ ప్రక్రియ..శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు

డీపీఆర్‌ రూపొందించారు..

హైదరాబాద్‌– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్‌ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్‌– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఎలివేటేడ్‌ కారిడార్‌ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

– మల్లురవి, ఎంపీ, నాగర్‌కర్నూల్‌

అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్‌– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్‌– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్‌) 105.6 కి.మీ., గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో పాటు మన్ననూర్‌– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్‌ కారిడార్‌ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్‌ భగీరథ పైపులైన్‌ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది.

అత్యంత కీలక మార్గం

హైదరాబాద్‌– శ్రీశైలం– తోకలపల్లి జాతీయ రహదారి–765 రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. దక్షిణకాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్‌–765లో 125 కి.మీ., దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. వన్యప్రాణులు తిరిగే 62.5 కి.మీ., ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తూ మిగతా ప్రాంతంలో భూ భాగంలోనే రోడ్డును విస్తరిస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌ నుంచి వెళ్లే భక్తులు తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్‌, మైసిగండి, ఆమనగల్‌, డిండి, మన్ననూర్‌ మీదుగా ప్రయాణిస్తారు. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఈ మార్గం గుండానే వెళ్తారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 7,750 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని రవాణా శాఖ అంచనా. శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య 10 వేలకు చేరుతుంది. ఇక 2027 నాటికి 12,200, 2040 నాటికి 27,580కి చేరుతుందని ట్రాఫిక్‌ అధ్యయనంలో తేలింది. అయితే ఈ రహదారి నల్లమల అటవీ గుండా సాగుతోంది. సుమారు 56 కి.మీ., మార్గం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఉండటంతో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుంది. ఈ రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో అటవీ మార్గంలో ఎలివేటేడ్‌ కారిడార్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ప్రమాదాలకు నెలవు..

హైదరాబాద్‌– శ్రీశైలం రహదారిపై పెరిగిన వాహనాల రద్దీతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఈ హైవేపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే రహదారిపై తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరించకపోవడంతో పాటు మధ్యలో డివైడర్‌ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.

అనుసంధానంగామరో రెండు..

ఎన్‌హెచ్‌–765కి అనుసంధానంగా కల్వకుర్తి (కొట్ర గేట్‌)–నంద్యాల–167కే జాతీయ రహదారి ఏర్పాటవుతుంది. అలాగే సోమశిల ఐకానిక్‌ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్‌ నుంచి తిరపతి వెళ్లే ప్రయాణికులకు 80 కి.మీ., దూరభారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌– శ్రీశైలం హైవేలోని కల్వకుర్తి వరకు ట్రాఫిక్‌ మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రెండు వరుసల ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం అంత సులువు కాదు. దీంతో హైదరాబాద్‌– శ్రీశైలం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో మూడు నెలల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ 1
1/1

విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement