
పోడు భూములకు మహర్దశ
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టనున్న ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంతో పోడు భూములకు మహర్దశ పట్టనుంది. గిరిజన, చెంచు రైతులు ఉద్యాన పంటలు పండించి ఆదాయం పొందేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపు, మార్గదర్శకాలను గిరిజన సంక్షేమశాఖ విడుదల చేసింది. వందశాతం రాయితీతో ఒక్కో యూనిట్‌కు రూ. 6లక్షల చొప్పున ఖర్చు చేస్తారు. పోడు భూముల్లో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు రానున్న ఐదేళ్ల పాటు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి వసతి కల్పిస్తారు. మొదటి మూడేళళ్లు అంతర పంటలు సాగుచేస్తూ.. ఆదాయం పొందే విధంగా రైతులను ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత పండ్ల తోటల నుంచి దిగుబడులు వచ్చి రైతులకు ఆదాయం సమకూరనుంది. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 27 మందికి చెందిన 50 ఎకరాల భూముల్లో సౌర విద్యుత్‌తో పాటు ఉచితంగా బోరుడ్రిల్లింగ్, 5హెచ్‌పీ మోటార్లు, స్పింకర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇద్దరు రైతులకు ఒకటి చొప్పున 16 బోర్లు వేయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలోని 114 గ్రామాల్లో 3,410 మంది చెంచు, గిరిజనులకు 7,765.12 ఎకరాల పోడు భూములకు అటవీ హక్కుల చట్టం కింద భూములపై హక్కు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేశారు. వీరందరికీ లబ్ధి చేకూరనుంది.
ఉమ్మడి జిల్లాలో పోడు భూముల వివరాలిలా..
నియోజకవర్గం గ్రామాలు రైతులు పోడు
భూములు
అచ్చంపేట 58 1,827 4,612.4
కొల్లాపూర్ 24 1,083 2.531.1
కల్వకుర్తి 3 8 24.5
మహబూబ్‌నగర్ 12 77 116.12
వనపర్తి 17 415 481
క్షేత్రస్థాయి పర్యటన..
ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కింద చేపట్టే డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, దానిమ్మ, వెదురు, కొబ్బరి ఇతర తోటలను పరిశీలించడానికి మాచారం గ్రామ చెంచు రైతులను దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లెపల్లి ఉద్యానవన పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పండ్ల తోటలు, మొక్కల పెంపకం, వాటికి ఆశించే చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పోడు భూములను చదును చేసి పండ్ల తోటలు పెంచేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
‘ఇందిరా సౌరగిరి జలవికాసం’తో
సౌర విద్యుత్‌తో పాటు సాగునీటి వసతి
గిరిజన, చెంచు రైతుల
సుస్థిర సాగుకు పక్కా ప్రణాళిక