
రోడ్డెక్కిన అన్నదాతలు
జడ్చర్ల: ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ గురువారం అన్నదాతలు ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. జడ్చర్ల శివారులోని పత్తి మార్కెట్ యార్డులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి పలు గ్రామాల నుంచి రైతులు ధాన్యం దిగుబడులను తీసుకొచ్చారు. అయితే నిబంధనల మేరకు పూర్తిగా ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పార బట్టడం వంటివి చేసి రోజులు గడుస్తున్నా.. ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రైతులు దాదాపు 20 రోజులుగా తమ ధాన్యం కుప్పల వద్దే రేయింబవళ్లు పడిగాపులు గాస్తున్నారు. ప్రతి రోజు ధాన్యాన్ని ఆరబెట్టడంతో పాటు ప్లాస్టిక్ కవర్లు కప్పుకుంటూ వర్షం నుంచి కాపాడుకుంటూ వస్తున్నా సంబంధిత అధికారులు ఎంత మాత్రం స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అయినా వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తి నష్టం జరుగుతున్నా కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.
● పత్తి మార్కెట్ యార్డు ఎదురుగా 167 నంబర్ జాతీయ రహదారిపై గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏ మాత్రం పనిచేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానా ఇబ్బందు లు పడి ధాన్యాన్ని అమ్ముకోవడానికి వస్తే కొను గోలు చేయకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. కనీసం సంబంధిత అధికారులు, పాలకులు జాడలేకుండా పోయారని ఆరోపించారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు ఆందోళన విమరమించేది లేదన్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జయప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ధాన్యం కొనుగోలు చేసే విధంగా సంబంధిత అధికారులు, పాలకులతో చర్చిద్దామంటూ రైతులతో ఆందోళన విరమింపజేశారు.
జడ్చర్లలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం
ఆగ్రహంతో జాతీయ రహదారిపైరాస్తారోకో
పట్టించుకునే వారే లేరని రైతన్నలమండిపాటు

రోడ్డెక్కిన అన్నదాతలు