
విద్యార్థులను విజయతీరాలకు చేరుస్తాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని పేద విద్యార్థులను విజయతీరాలకు చేర్చేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటుచేసిన పయనీర్ కార్యక్రమంలో ఎప్‌సెట్ కోచింగ్ తీసుకుని ర్యాంకులు సాధించిన 114 మంది విద్యార్థులకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేయగా.. కలెక్టర్ విజయేందిర బోయి, పీయూ వీసీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పయనీర్ కార్యక్రమంలో తీసుకున్న ఎంసెట్ కోచింగ్ ద్వారా పేద విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు సైతం టాలెంట్ ఉంటుందని, దాన్ని వినియోగించుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఇక్కడ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా కళాశాల, హాస్టల్ వసతి కల్పించేందుకు జేపీఎన్‌సీఈ చైర్మన్ రవికుమార్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాల మంజూరయ్యాయని, ఐఐఐటీ కళాశాల, నవోదయ సైతం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
● కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేద విద్యార్థుల ఉన్నతికి కృషి చేయడం గొప్ప విషయమన్నారు. తన వద్దకు ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా జిల్లాలో విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తారని చెప్పారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. విద్యాభివృద్ధిలో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
● పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోడ్పాటుతో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంచి కళాశాలల్లో సీటు లభించే అవకాశం ఉందన్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారిగా ఎదగాలని ఆకాంక్షించారు. పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ఎమ్మెల్యే యెన్నం ఎంతో కృషి చేశారని.. ఇందులో డాటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వంటి మంచి కోర్సులు తీసుకువస్తున్నట్లు వివరించారు. తాజాగా ఐఐఐటీ ఏర్పాటుతో పాలమూరు ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందన్నారు.
‘పయనీర్’తో 114 మందికి ఎప్‌సెట్‌ర్యాంకులు
ర్యాంకర్ల అభినందన సభలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి