
సుందరీమణుల భద్రత అత్యంత కీలకం: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: ప్రపంచ సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో విధుల్లో ఉండే ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో గురువారం పోలీస్ అధికారులకు విధుల కేటాయింపుతో పాటు బ్రీఫింగ్ నిర్వహించారు. 22 మంది మిస్ వరల్డ్ పోటీదారులు పిల్లలమర్రికి వస్తున్న క్రమంలో మూడు అంచెల భద్రత ఉంటుందని తెలిపారు. సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పర్యటన ఉంటుందని, ఇందులో శ్రీ రాజారాజేశ్వరి ఆలయం, పురాతన మ్యూజియం, పిల్లలమర్రి మహావృక్షం సందర్శిస్తారని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా బందోబస్తు నిర్వహించాలని, ప్రజలకు, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమం కావడం వల్ల జిల్లాకు గర్వకారణం అవుతుందని, సుందరీమణుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, సుదర్శన్, శ్రీనివాసులు, సీఐలు పాల్గొన్నారు.