
లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడి దుర్మరణం
మహబూబ్‌నగర్ క్రైం: లారీ ఢీకొట్టడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వన్‌టౌన్ ఎస్‌ఐ శీనయ్య తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్టకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహ్మద్ అబ్దుల్ రఫీక్ (52) మంగళవారం సాయంత్రం జేపీఎన్‌సీఈలో శిక్షణ ఉండడంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వన్‌టౌన్ చౌరస్తాలో బైక్‌ను రాయచూర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రఫీక్‌కు తీవ్రగాయాలై స్పాట్‌లోనే మరణించాడు. మృతుడి భార్య నహీద బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మున్సిపల్ కార్మికుడి బలవన్మరణం
జడ్చర్ల/జడ్చర్ల టౌన్: ఓవైపు అప్పులబాధ, మరోవైపు అనారోగ్య సమస్యలతో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ కమలాకర్ వివరాల మేరకు.. జడ్చర్ల వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు (38) స్థానిక మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. చేసిన అప్పులను తీర్చేందుకు గాను ఇటీవల మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఫైనా న్స్‌లో రూ. 4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రతినెలా కిస్తీ కట్టాల్సి ఉండగా.. మొదటి నెల మాత్రమే కట్టాడు. తర్వాత అతడు అనారోగ్యానికి గురికావడంతో తర్వాతి కిస్తీలు కట్టలేకపోయాడు. ఈ క్రమంలో ఫైనాన్స్ వారి నుంచి ఒత్తి డి రావడంతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడాయి. వీటితో మానసిక ఆందోళనకు గురైన అతడు.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మాధురి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం మున్సిపాలిటీ తరఫున రూ. 30వేలు అందజేశారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. మండలంలోని కుమ్మెర గ్రామానికి చెందిన ఉపేందర్ (23) హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. అతడు మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని లాడ్జీలో రూం అద్దెకు తీసుకొని అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మృతదేహం లభ్యం
అచ్చంపేట రూరల్: మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలోని పీర్లబావిలో మంగళవారం గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైంది. విధుల్లో భాగంగా పంచాయతీ కార్మికుడు పరమేశ్వర్ బావి దగ్గర చూడగా శవం ఉన్నట్లు గుర్తించి పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుకు సమాచారం ఇచ్చాడు. అతను సిద్దాపూర్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు శవాన్ని బయటకు తీశారు. మృతుడు కాఫీ రంగు టీ షర్ట్, సిమెంట్ రంగు ఫార్మల్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు. కుడి చేతిపై వి.అనిత 143 అనే టాటూ ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
బస్టాండ్‌లో భారీ చోరీ
మాగనూర్ (మక్తల్): మక్తల్ బస్టాండ్‌లో మంగళవారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. మక్తల్ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి వివరాల ప్రకారం.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్‌కు చెందిన ఉప్పరి మహేశ్వరి ఆశ కార్యకర్తగా పని చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం యాదిగిరి జిల్లాలో నివాసముంటున్న చెల్లెలు అవసరం నిమిత్తం సరస్వతి మహిళా సంఘంలో రూ.3.50 లక్షలు లోనుగా తీసుకొని యాదగిరి వెళ్లడానికి మక్తల్ బస్టాండ్‌కు వచ్చారు. రాయచూర్ బస్సు ఎక్కి మాగనూర్ సమీపంలో బ్యాగును చూసుకోగా డబ్బు కనిపించలేదు. వెంటనే మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తాళం వేసిన ఇంట్లో దొంగతనం
జడ్చర్ల: పట్టణంలోని సాయినగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారు. సీఐ కమలాకర్ వివరాల మేరకు.. ఏపీలోని కృష్ణా జిల్లా రాఘవపురానికి చెందిన రామకృష్ణారెడ్డి ఉద్యోగం రీత్యా జడ్చర్లలోని సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 10న కుటుంబసభ్యులతో కలసి సొంతూరుకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలో దాచిన మూడు తులాల బంగారు నగలతో పాటు 20 తలాల వెండి కొంత నగదు చోరీకి గురి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.