
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: నిరంతరం ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నతస్థానాలకు చేరుకోవచ్చని, జిల్లా క్రీడాకారులు క్రికెట్‌లో రాష్ట్రానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీవెంకటేశ్ అన్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెటర్లను జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రోత్సహిస్తుండడం అభినందనీయమన్నారు. ఇటీవల ఐపీఎల్‌లో బిహార్ యువ క్రీడాకారుడు వైభవ్ 35 బంతుల్లో సెంచరీ చేశాడని, ఆయనను పీఎం మోదీ ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. ఉమ్మడి జిల్లాలో ఐదు ప్రాంతాల్లో నెలరోజుల పాటు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు ఇస్తున్నారని, విద్యార్థులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ గతేడాది కంటే ఈ ఏడాది వేసవి క్రికెట్ శిబిరాలకు ప్రత్యేకత ఉందన్నారు. ఈ ఏడాది వేసవి శిబిరాల్లో మొదటిసారి ఇంట్రా టోర్నమెంట్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిని క్రీడాకారులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు ఈ వేసవి శిక్షణ శిబిరాలు, ఇంట్రా టోర్నమెంట్‌లు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. త్వరలో మహబూబ్‌నగర్‌లో అండర్–19 లేదా అండర్–16 జాతీయస్థాయి టోర్నమెంట్ నిర్వహించడానికి హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ హామీ ఇచ్చిందన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో ఒక బాలికల టోర్నమెంట్ కూడా నిర్వహిస్తామని అన్నారు. బాలికలకు ప్రత్యేక క్రికెట్ శిక్షణ అందజేస్తామని తెలిపారు. ఈ సారి ప్రత్యేకంగా టర్ఫ్ వికెట్‌పై 14 జట్లతో మహబూబ్‌నగర్ ప్రీమియర్ లీగ్‌ను జూలైలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కార్యదర్శి రాజశేఖర్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, ఎండి.మన్నాన్‌తోపాటు సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, ఆబిద్ పాల్గొన్నారు.