
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సార్వత్రిక సమ్మెకు మద్దతుగా శనివారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్‌హాల్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమైంది. అక్కడి నుంచి కొత్త బస్టాండు, న్యూటౌన్, జీజీహెచ్, మెట్టుగడ్డ మీదుగా బాయమ్మతోట, రాజేంద్రనగర్, పాత డీఈఓ కార్యాలయం, ఎర్రసత్యం విగ్రహం, తెలంగాణచౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్ మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు పరచాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వద్దని, 8 గంటల పనిని 12, 14 గంటలకు పెంచే విధానం ఉపసంహరించుకోవాలన్నారు. సకల కార్మికులందరికీ పని భద్రత, ఉపాధిహామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కిల్లె గోపాల్, ఖమర్‌అలీ, చంద్రకాంత్, రాంమోహన్, పృథ్వీసింగ్, గోపాల్‌నాయక్, దేవానంద్, యు.కృష్ణయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.