
ఆదర్శమూర్తి.. అమ్మ
పిల్లల కోసం పలు అవతరాలు ఎత్తుతున్న తల్లి
నేడు మదర్స్ డే
ఇష్టాలు మార్చుకుంటూ..
పాలమూరు: అమ్మ అనే పదం అద్భుతం.. ఎంత చెప్పినా తక్కువే.. ఆదర్శ మూర్తి, చైతన్య స్ఫూర్తి.. అమ్మను ఎంత తలచినా మధురమే. అనుబంధానికి, అనురాగానికి ఆమె వారధి, సారథి. తొలి అడుగులో తడబాటును.. బతుకు బాటలో పొరపాటును సరిదిద్దుతోంది. అందుకే అమ్మే నిత్య చైతన్యస్ఫూర్తి. జన్మనిచ్చినప్పటి నుంచి పెద్దయ్యే వరకు రక్షణ కవచంగా ఉంటూ ప్రపంచాన్ని చూపుతోంది. కన్న పిల్లల కోసం ఎన్ని బాధలైనా ఓర్చుకుంటారు. నేటి సమాజంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన పలువుర్ని పలకరిస్తే వారి రోల్ మోడల్ అమ్మే అంటారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
తొలి గురువు..
బిడ్డకు జన్మించినప్పటి నుంచి పెద్దయ్యే వరకు అమ్మ ఒక గురువులా వారికి ప్రపంచాన్ని చూపిస్తుంది. బాల్యంలో అన్ని విషయాలు బోధించేది అమ్మే. తల్లే తొలి గురువు. చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపించే నాటి నుంచి పెద్దయ్యే వరకు తల్లులు పిల్లలకు ఎన్నో విషయాలు బోధిస్తారు. వారికి చెప్పడానికి కథలు నేర్చుకుంటారు. వారి కోసం తమ పంథా మార్చుకుంటారు. అమ్మ పెంపకాన్ని బట్టే పిల్లల ఎదుగుదల ఉంటుంది. పిల్లల ప్రతి దశలోనూ అమ్మ ప్రభావం ఉంటుంది.
అమ్మకు ఎర్రరంగు అంటే అస్సలు ఇష్టం ఉండదు.. కానీ కూతురికి అదే ఎక్కువ మక్కువ. షాపింగ్‌కు వెళ్లినప్పుడు అమ్మ ఆకుపచ్చ పట్టుచీర కొందామంటే కూతురు ఎర్ర పట్టు కొంటే బాగుంటుంది అనగానే తల్లి తన ఇష్టాన్ని మార్చుకుంది. అప్పుడు అమ్మ కళ్లకు ఎర్ర రంగు పట్టుచీర ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇలా కట్టుకునే దుస్తుల నుంచి తినే తిండి వరకు అమ్మ తన ఇష్టాలను పక్కన పెట్టి పిల్లలు చెప్పిన దానికే ఓటు వేస్తుంది.
ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యత అంతా ఆమెదే. పిల్లల కోసం స్కూటీ నేర్చుకోవాల్సి వస్తోంది. రోజూ హోం వర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకొని పిల్లలను నిద్రలేపుతుంది. తొమ్మిదింటికల్లా బడికి పంపించి ఆమె ఉద్యోగానికి ఉరగెత్తాలి. తిరిగి సాయంత్రం ఇంటికొచ్చాక పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. పిల్లలు అడిగిన కొత్త వంటకాల్ని టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లలో ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకొని కమ్మగా వండి పెడుతోంది.