
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
భూత్పూర్: మున్సిపాలిటీలోని శేరిపల్లి (బి) వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. కడప నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న శివదర్శిని ప్రైవేట్ బస్సు మరమ్మతుకు గురైంది. బస్సు క్లీనర్ ప్రవీణ్ కుమార్ (43) వేరే చోట బస్సు డ్రైవర్‌గా పనిచేసే శ్రీహర్షకు విషయం చెప్పాడు. అతను భార్య వీరమణికి (38)కు చెప్పగా ఆమె గ్రామానికి చెందిన శివకుమార్ ద్వారా బస్సును లాగడానికి ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకొని బయలుదేరారు. బస్సును తాడుతో ట్రాక్టర్‌కు కట్టి భూత్పూర్ వైపునకు తీసుకొస్తుండగా తాడు తెగిపోయింది. ప్రవీణ్ కుమార్, వీరమణి మళ్లీ తాడును కట్టి లాగే క్రమంలో బస్సు సడెన్‌గా స్టార్ట్ అయి ప్రవీణ్ కుమార్, వీరమణితో పాటు ట్రాక్టర్‌ను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ట్రాక్టర్ బోల్తా పడగా వీరమణి, ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన ట్రావెల్ బస్సు డ్రైవర్ హరిప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఆటో ఇప్పించలేదని యువకుడి బలవన్మరణం
కొత్తకోట రూరల్: ఆటో కొనుక్కుకోవడానికి తండ్రి డబ్బులు ఇవ్వని కారణంగా మనస్తాపానికి గురైన ఓ కొడుకు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కొత్తకోట మండలం అప్పరాలలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాల మేరకు.. అప్పరాల గ్రామానికి చెందిన జంగాల కృష్ణమ్మ, జంగాల పుల్లన్న దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరి రెండో కుమారుడైన శివ(21) తనకు ప్యాసింజర్ ఆటో కావాలని తండ్రితో మొరపెట్టుకునేవాడు. పుల్లన్న ఇటీవలే కుమార్తె వివాహం చేయడంతో తన డబ్బులు లేవని లేవని చెప్పిన శివ వినిపించుకోలేదు. ఈనెల 9న మరోమారు తండ్రితో తనకు ఆటో ఇప్పిస్తావా? లేదా అని వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శివ తిరిగి వచ్చి పురుగుల మందు తాగానని చెప్పడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ శనివారం మృతి చెందాడు. తమ కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం