కూలీ కోసం వెళ్తే.. కాటికి పంపారు | - | Sakshi
Sakshi News home page

కూలీ కోసం వెళ్తే.. కాటికి పంపారు

Mar 22 2025 1:12 AM | Updated on Mar 22 2025 1:08 AM

మక్తల్‌: బతుకుదెరువు కోసం కరెంట్‌ (కూలీ) పనులు చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని చందాపూర్‌ గ్రామానికి చెందిన సిరిపే మహేష్‌(23) అదే గ్రామానికి చెందిన చిన్న వెంకటేష్‌తో కలిసి కరెంట్‌ పనులు చేసేందుకు కూలీగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కర్ని గ్రామ శివారులోని ఎర్సాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతుల పొలాలకు కొత్తగా విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్‌ చిన్న వెంకటేష్‌ సంబంధిత లైన్‌మేన్‌ లింగప్పకు చెప్పగా కరెంట్‌ నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా కరెంట్‌ సరఫరా కావడంతో విద్యుత్‌ స్తంభంపై వైర్లు సరిచేస్తున్న సిరిపె మహేష్‌ ఒక్కసారిగా షాక్‌కు గురై స్తంభంపైనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వెంటనే కూలీలు లైన్‌మేన్‌ లింగప్పకు సమాచారం అందించడంతో లైన్‌మేన్‌ లింగప్ప కర్ని సబ్‌స్టేషన్‌కు వద్దకు చేరుకొని ఆపరేటర్‌ లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నీదంటే నీది తప్పంటూ వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా లైన్‌మెన్‌ లింగప్ప మరో వ్యక్తితో వీడియో తీయించి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేసి.. తన తప్పు లేదని కప్పిపుచ్చుకునేందుకు ఇలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత లైన్‌మేన్‌, ఆపరేటర్‌ సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకుని ఇద్దరూ పరారయ్యారు. అయితే ఆపరేటర్‌ లక్ష్మణ్‌ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

కుటుంబీకుల ఆందోళన

సమాచారం తెలుసుకున్న సిరపె మహేష్‌ తల్లిదండ్రులు పోలప్ప, భీమమ్మతో పాటు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మహేష్‌ మృతికి లైన్‌మేన్‌ లింగప్ప, ఆపరేటర్‌ లక్ష్మణ్‌ కారణమని ఆరోపిస్తూ కర్ని సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం మృతదేహంతో మక్తల్‌కు చేరుకుని అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న మక్తల్‌ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి అక్కడికి చేరుకొని కుటుంబీకులకు నచ్చజెప్పి మృతదేహాన్ని స్థానిక సబ్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లేలా ఒప్పించారు. అక్కడ విద్యుత్‌ శాఖ డీఈ నర్సింగ్‌రావు, ఏడీ జగన్‌మోహన్‌, ఏఈ రామకృష్ణ తదితరులు వచ్చి మహేష్‌ బంధువులతో చర్చలు జరపగా పరిహారంగా రూ.8 లక్షలు అందజేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం మహేష్‌ మృతదేహాన్ని మక్తల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

లైన్‌మేన్‌, ఆపరేటర్‌ నిర్లక్ష్యంతో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

నారాయణపేట జిల్లా ఎర్సాన్‌పల్లిలో ఘటన

కూలీ కోసం వెళ్తే.. కాటికి పంపారు 1
1/2

కూలీ కోసం వెళ్తే.. కాటికి పంపారు

కూలీ కోసం వెళ్తే.. కాటికి పంపారు 2
2/2

కూలీ కోసం వెళ్తే.. కాటికి పంపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement