జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ నియమించినట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్యారోగ్య, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగే రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, ఎస్పీ, ఆర్‌అండ్‌బీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాల్లో రహదారి భద్రతపై సమావేశాలు నిర్వహించి తీసుకున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదికలు సమర్పించాలన్నారు. సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గతేడాది జిల్లాలో 108 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు డేటా ఉందని, ఆయా శాఖలు డేటా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా 19 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు ఆయన వివరించారు. పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వం నవంబర్ 16, 2024 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వంద శాతం మినహాయింపు చేసిందని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజుల్లో రోడ్డు భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. జాయింట్ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ దేశ్యానాయక్, ట్రాన్స్‌ఫోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి
భద్రత చర్యలపై తీసుకున్న నిర్ణయాలపై నివేదికలు పంపండి
విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి
రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్