
భూ వివాదంలో పరస్పర దాడులు
దోమ: భూ వివాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం దోమ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన బుసకోటి రామకృష్ణకు మండలంలోని గుండాల శివారులో భూములున్నాయి. అదే గ్రామానికి చెందిన దాయాదులు పిట్ల కృష్ణయ్య, వెంకటరాములు, సాయిలు, శివకు అక్కడే భూములున్నాయి. వీరి నడుమ కొంతకాలంగా భూ తగాదాలు కొనసాగుతున్నాయి. సర్వే నంబర్ 73లో కొంత భాగం తమకు వస్తుందని దాయాదులు రామకృష్ణను కోరారు. ఇందుకు సర్వే సైతం చేయించినా ఆయన నిరాకరించాడు. దీంతో పరస్పరం గొడ్డలి, కర్రలతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో రామకృష్ణపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా, దాయాదులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఒకరికి తీవ్రగాయాలు